సమస్యల పరిష్కారం కోరుతూ ఐటిడిఎ ముందు ఆందోళన
విజయనగరం,సెప్టెంబర్24(జనంసాక్షి): సిఆర్‌టిఎస్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని-రెగ్యులరైజ్
చేయాలని కోరుతూ.. సోమవారం సిఆర్‌టిఎస్ ఉద్యోగులు ఐటిడిఎ ముందు ధర్నా నిర్వహించారు. సిఆర్‌టిఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ.. సంవత్సరానికి 12 నెలల జీతాలివ్వాలని, సిఆర్‌టి పోస్టులు మినహాయించి డిఎస్‌సి ఇవ్వాలని కోరారు. 10వ పిఆర్‌సి ప్రకారం జీతాలివ్వాలని, తదితర డిమాండ్లు చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. మరోవైపు ఇళ్ల స్థలాలు, భూమి పట్టాలు కోసం రెల్లి కులస్తులు సోమవారం ఐటిడిఎ ముందు ధర్నా నిర్వహించారు. రెల్లి కులస్తులు మాట్లాడుతూ.. మక్కువ మండల రెల్లి వీధిలో దాదాపు 180 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. 45 సంవత్సరాలుగా ఒక్కో ఇంట్లో కనీసం మూడు, నాలుగు కుటుంబాలు కలిసి నివాసముంటున్నామని చెప్పారు. తాము నివసించేందుకు ఇళ్ల స్థలాలివ్వాలని, భూమి పట్టాలివ్వాలని కోరుతూ రెల్లి కులస్తులంతా 45 సంవత్సరాలుగా గృహ నిర్మాణ సంస్థ అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నవించుకున్నా వారికి న్యాయం జరగలేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా వినతి పత్రాన్ని అందజేశామని, అక్కడ నుంచి మక్కువ రెవిన్యూ అధికారికి ద్వారా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇంతవరకు ఏ అధికారులూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన చెందారు. అధికారులు తమకు న్యాయం చేయాలని, 301 – ఎ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. ధర్నాకు స్పందించిన ఆర్‌డిఒ సుదర్శన్ దొర సమగ్ర దర్యాప్తు నిర్వహించి ఇళ్ల స్థలాలిస్తామని హావిూ ఇచ్చారు.