బ్రిటన్ కన్జర్వేటివ్ ప్రభుత్వం రూపొందించిన కార్మిక వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్ మలి ఓటింగ్‌లో ఆమోదముద్ర వేసింది. జెర్మీ కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ 33 ఓట్ల తేడాతో పార్లమెంట్ దీనిని ఆమోదించింది. మాజీ సీనియర్ బ్యాంకర్ అయిన వాణిజ్యమంత్రి సాజిద్ జావిద్ ప్రతిపాదించిన ఈ బిల్లులో కార్మికులు పారిశ్రామిక, రాజకీయ కార్యకలాపాలను నేరంగా పరిగణించాలని ప్రతిపాదించారు. ఈ బిల్లులోని పలు నిబంధనలు గతంలోని నియంతృత్వ ప్రభుత్వాలు ప్రతి పాదించినవే కావటం విశేషం. కార్మికులు నిరసన ప్రదర్శనలు చేయటానికి ముందు తమ పేర్లను పోలీసుల వద్ద నమోదు చేసుకోవాలన్న ఈ బిల్లులో నిబంధనను ప్రస్తావించిన కన్జ ర్వేటివ్ మాజీ సభ్యుడు డేవిడ్ డేవిస్ ఇది గతంలో స్పానిష్ సైనిక నియంత జనరల్ ఫ్రాంకో హయాంలో అమలైన రాక్షస చట్టాలను తలపిస్తున్నదని విమర్శించారు. బ్యాలెట్ నిర్వహణకు సైతం కఠిన నిబంధనలు విధించిన ఈ చట్టం బ్యాలెట్‌ను పాటించకుంటే చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తోంది. ‘ప్రతి పారిశ్రామిక ఆందోళన’కు బ్యాలెట్ నిర్వహణను తప్ప నిసరి చేసిన ఈ చట్టం సంఘ సభ్యుల్లో 50 శాతం కన్నా తక్కు వ మంది ఓటు చేసినా లేదా పోస్టల్ బ్యాలెట్‌లో 40 శాతం కన్నా తక్కువ మంది సానుకూలత వ్యక్తంచేసినా దానిని చట్టవిరుద్ధం గానే ప్రకటిస్తారు. ఈ బ్యాలెట్‌ను ‘ప్రధాన ప్రభుత్వ సర్వీసు’ లన్నింటిలోని కార్మికులకు నిర్వహిస్తారు. ఆరోగ్య, 17 ఏళ్లలోపు వారి విద్య, అగ్నిమాపకసేవలు, రవాణా రంగం, సరిహద్దు భద్రత, అణు విద్యుత్ సేవల వంటి వాటిని ఈ ‘ప్రధాన ప్రభుత్వ సేవల’ పరిధిలోకి తెచ్చారు. ఈ ఆంక్షలన్నింటినీ అధిగమించి కార్మికులు ఆందోళనకు పూనుకుంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సిన వ్యవధిని ఏడు రోజుల నుండి 14 రోజులకు పెంచుతూ నిబంధనలను పొందుపర్చారు.