సమ్మె తగ్గేదే లేదు – మరింత ఉధృతం చేస్తాం * ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్వాడి ఉద్యోగులు

టేకులపల్లి, సెప్టెంబర్ 26( జనం సాక్షి ): అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె తగ్గేదే లేదని మరింత ఉధృతం చేస్తామని ఏఐటియుసి, సిఐటియు జిల్లా నాయకురాళ్లు వై ఇందిరా, కొండపల్లి శకుంతల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే అంతవరకు మేము వెనక్కి తగ్గేదే లేదని, రోజుకో రూపంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 16 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని, దీంతో సిబ్బంది సమ్మె మరింత తీవ్రం చేస్తామన్నారు. తాము చర్చలకు సిద్ధమని పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ వెంటనే స్పందించకపోతే ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధనం చేస్తామని అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్యహితంగా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు ఐదు లక్షలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మా న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం చర్చకు సిద్ధమవ్వాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకురాలు వై పద్మావతి, వి సంధ్యారాణి,ఎన్ విజయలక్ష్మి,ఎం నాగమణి, టి వరమ్మ, జి పద్మ,సుగుణ,స్వర్ణ, శివకుమారి, బిచ్చాలి, సిఐటియు నాయకురాలు వి రాజేశ్వరి,కల్తీ భద్రమ్మ, కే రాజేశ్వరి, ఐ రాధా, పద్మ,సుశీల, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.