సమ్మె సెగ రాజుకుంది ..?!
నీ రాజ సింహాసనం ఆశించలేదు
మణులు,మాణిక్యాలేవి అడగలేదు
పంట గిట్టుబాటు “ధర” ఆర్తించారు
సేద్యానికి “భద్రత ” కావాలన్నారు
అంత మాత్రానికే ….
నలుపు చట్టాలు ఎక్కుపెట్టి
హక్కుల కుత్తుక తెగ్గోస్తానంటే ..
బతుకుల సమాధి చేస్తానంటే …
తలాడించే వెంగలప్పలు కారు
ఉప్పు,కారం ఒంట బట్టించినోళ్లు
తెగువతనం మెదట్ల దట్టించినోళ్లు
త్యాగాలను తనువులకు అద్దినోళ్లు
పోరాటాలకు “పాఠం” నేర్పినోళ్లు
మాట తప్పనోళ్లు,మడమ తిప్పనోళ్లు,
అందుకే జంగ్ సైరన్ మోగించి
ఢిల్లీ ముట్టడికి దండుగ కదిలిండ్లు
ట్రాలీ, ట్రాక్టర్లతో మోహరించిండ్లు
చీకటి చట్టాలు రద్దు చేయుదాక
పట్టు వీడం, మెట్టు దిగమంటూ …
సరిహద్దుల్లో భీష్మించి కూర్చున్నరు
వాటర్ పిరంగులు,లాఠీలు
నిర్బంధాలు , అక్రమ కేసులు
అణిచివేతలు ఉద్యమాన్ని ఆపలేవు
చర్చల పేర ఎత్తుగడలు ఇక చెల్లబోవు
ఇపుడు అన్నదాత ధర్మ పోరాటానికి
పౌర సమాజం సంఘీభావం తెలిపింది
భారత్ బంద్ కు మద్దతుగా కదిలింది
ప్రజా వ్యతిరేక పాలకుడా..!
పలాయనం చిత్తగించుటే శరణ్యం
రైతు జెండా ఎగరేయుటే ఆలస్యం
“””””””””””””””””””””
(అన్నదాత నిరసనోద్యమానికి మద్దతుగా…)