సర్కార్ నిర్ణయంతో గ్యాస్ వినియోగదారుల్లో ఆందోళన
ఆదిలాబాద్, అక్టోబర్ 25 : రాష్ట్రంలో రాయితీ సిలిండర్లను 9కి పెంచుతారని ఆశించిన పేదలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రాయితీ సిలిండర్లను 9కి పెంచాలని సోనియా గాంధీ ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోక కేవలం దీపం కనెన్షన్ ఉన్నవారికే రాయితీ సిలిండర్లు పెంచడాన్ని నిరుపేదలకు నిరాశకు గురి చేసింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల కనెన్షన్లు ఉన్న నిరుపేదలకు మరింత భారం తప్పదు. పేదవారి కుటుంబాలలో సభ్యులు ఎక్కువగా ఉండడం, సిలిండర్లు వాడకం ప్రతి ఏడాది 9 వరకు అసరమవుతాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు మరింత భారం పడనున్నది. జిల్లాలో సుమారు లక్ష 40 వేల వరకు దీపం కనెన్షన్లు ఉన్నాయి. వీరంతా నిరుపేదలకు కావడం, ఇందులో చాలా మంది ఏడాదికి 5,6 మాత్రమే వాడుతున్నారు. ఇందులో 60 శాతంకి పైగా డీలర్ల నుండి దీపం కనెన్షన్లు పొందారు. దీపం కనెక్షన్ల దారులకు అదనపు ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం మామూళ్లు వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ సిలిండర్లపై ప్రభుత్వం కోత విధించడంపై సామాన్యులు తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని రాయితీ సిలిండర్లను 9కి పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.