సహకారసంఘ ఎన్నికల్లో 1536మంది అభ్యర్థుల పోటీ
కరీంనగర్, జనవరి 31 (): జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల తదితర ప్రాంతాల్లోని 64 సహకార సంఘాల ఎన్నికలకు 1536మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీటిలో కొన్ని సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. సహకార సంఘ ఎన్నికల్లో రైతులతో మమేకమైనవారే విజయం సాధిస్తారు. వేములవాడ ప్రాంతానికి బిజెపి, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్‌లకు చెందిన వారు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సహకార సంఘ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. బిజెపి నుండి శంకరయ్య, కాంగ్రెస్‌నుండి తిరుపతి రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి మహేశ్, వైయస్సార్ సీపీ నుంచి వేణు పోటీలో ఉన్నారు. సిరిసిల్ల సహకార ఎన్నికల చైర్మన్ పదవికి గతంలో పనిచేసిన కెడిసిసి బ్యాంకు చైర్మన్ కొండురు రవీంద్రరావు, చిక్కం రామారావులు పోటీ పడుతున్నారు. జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో సహకార ఎన్నికలు జరుగుతున్నాయి. మరో విడత జరిగే ఎన్నికల్లో జిల్లాలోని కెడిసిసి బ్యాంకు చైర్మన్ పదవి కోసం మరికొందరు పోటి పడనున్నారు. జిల్లాలో గురువారం జరుగుతున్న ఎన్నికల్లో సగానికిపైగా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సహకార సంఘం ఓట్ల లెక్కింపు జాప్యం కావచ్చునని, ఈ రాత్రి వరకు వెల్లడికావచ్చని తెలుస్తోంది.