సహజవనరుల వినియోగంలో వెనుకంజ
ఉత్తరాంధ్ర వెనకబాటుకు కారణం ఇదే: మంత్రి కాల్వ
శ్రీకాకుళం,ఆగస్ట్6(జనం సాక్షి ): ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో సహజ వనరులు సమృద్ధిగా వున్నా వాటిని వినియోగించుకోలేక పోవడం వల్లే వెనుకబాటుతనం ఉందని మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. ఈ జిల్లాల్లో వెనుకబాటుతనానికి ముగింపు పలకాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మంత్రులు పర్యటించారు. మంత్రులు కాలవ శ్రీనివాసులు, కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రులు అరసవల్లిలో పిఎంఎవై పట్టణ గృహాలకు శంకుస్థాపన చేశారు. ప్రెస్ అకాడవిూ ఆధ్వర్యంలో జర్నలిస్టుల శిక్షణా తరగతులు ప్రారంభించారు. జర్నలిస్టులు మంత్రి కాలవ శ్రీనివాసులను శాలువతో సన్మానించారు. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల మధ్య పలు అంశాలలో సారూప్యత ఉందని, వెనుకబాటు తనం, పేదరికం వంటి అంశాలలోను, భౌగోళికంగా సారూప్యత ఉందని మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సమాచార రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను జర్నలిస్టులకు పరిచయం చేసి వారిలో అవగాహన పెంపొందించేందుకే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టులు వాస్తవాలనే వార్తలుగా అందించాలని, వాస్తవాలు రాసే జర్నలిస్టులే ప్రభుత్వానికి మిత్రులని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో జర్నలిస్టులకు పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని, రెండు, మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకారం ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు.