సాగరమాలతో కోటి ఉద్యోగాలు
– ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1.60లక్షల కోట్ల పెట్టుబడులు
– వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై ప్రత్యేక దృష్టి
– భూసేకరణ సమస్యతో విశాఖపోర్టును విస్తరించలేక పోతున్నాం
– కొత్త పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం
– కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
విశాఖపట్టణ, జులై13(జనం సాక్షి) : సాగరమాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1,60,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని ఏపీ పర్యటనలో భాగంగా తెలిపారు. వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై ప్రత్యేకమైన దృష్టి సారించామన్నారు. భూసేకరణ సమస్యతో విశాఖ పోర్టును విస్తరించ లేకపోతున్నామని స్పష్టం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఓడల రేవు వద్ద కొత్త పోర్టు నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని ఆయన తెలిపారు. కొత్త పోర్టు నిర్మాణానికి మూడు వేల ఎకరాల అవసరం ఉంటుందని పేర్కొన్నారు. సాగరమాలకు లక్షా అరవై వేల కోట్లు, జాతీయ రహదారులకు లక్షా 50 వేల కోట్లు, జలవనరులకు లక్ష కోట్లు ఏపీకి కేటాయించామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ముంబయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు రెండు ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. విశాఖలో కూడా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించమని పోర్టు చైర్మన్ ను ఆదేశించామని గడ్కరి తెలిపారు. అన్ని పోర్టులకు కంటైనర్ స్కానర్లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విశాఖ పోర్టు విస్తరణకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
కృష్ణానదిలో క్రూజ్ టెర్మినల్ ఏర్పాటవుతుందని తెలిపారు. పోర్టులు ఉన్న చోట క్రూజ్ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ సముద్రంలో తేలియాడే ¬టల్ ఏర్పాటు చేసేందుకు అవకాశాన్ని పరిశీలించమని పోర్టు ఛైర్మన్ కు సూచించామని తెలిపారు. పోర్టుల కాలుష్యాన్ని తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని గడ్కరి పేర్కొన్నారు.