సాగుచట్టాలపై మోడీ యూ టర్న్‌

మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి

పార్లమెంటులో ఆమోదించి రద్దు చేస్తాం

జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రకటన

రద్దుప్రకటనతో రాజకీయపార్టీలు, రైతు సంఘాలు ఆనందం

న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) : దేశ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతలు విజయం సాధించారు. రైతుల ఆందోళనలతో కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. సాగుచట్టాలు రద్దేచేయడంలో విజయం సాధించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు సాగుచట్టాలను రద్దుచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన ప్రకటన చేశారు. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం అని ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఒక వర్గాన్ని ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు.నేను దేశానికి క్షమాపణలు చెబుతున్నాను, స్వచ్ఛమైన హృదయంతో… మేం రైతులను వ్యవసాయ చట్టాలపై ఒప్పించలేకపోయాం. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడానికి నేను ఇక్కడ ఉన్నాను… ఈ నెల పార్లమెంటు సమావేశాల్లో రద్దు లాంఛనాలను పూర్తి చేస్తామని ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇదే సందర్భంలో రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చిన్న రైతుల కోసం అనేక పథకాలు తెచ్చామని పేర్కొన్నారు. 10 కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమే ఉందని, అదే వారికి జీవనోపాధని అన్నారు. వ్యవసాయ బ్జడెట్‌ను 5 రెట్లు పెంచిన ఘటన తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రూరల్‌ మార్కెట్‌ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని చెప్పారు.  కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తిరిగి తెరవనున్నట్లు చెప్పారు. అంతకముందు ’ సిక్కుల మొదటి గురువు, సిక్కు మతస్థాపకులు గురునానక్‌ దేవ్‌ జీ జయంతి  సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.  సుమారు సంవత్సర కాలం నుండి ఈ సాగు చట్టాలు రద్దు చేయాలని ఢల్లీి  సరిహద్దుల్లో అన్నదాతలు  ఆందోళనలు చేపడుతున్నారు.  ఇప్పుడు ఈ చట్టాల రద్దు రైతుల విజయంగా భావిస్తున్నారు. అదేవిధంగా వచ్చే ఏడాది పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ తో సహా ఐదు రాష్టాల్రకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.