సాగుచట్టాల రద్దుపైరైతు సంఘాల హర్షం
నందిగామ సెంటర్‌లో బాణాసంచా కాల్చిన నేతలు
విజయవాడ,నవంబర్19(జనం సాక్షి ) : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతుసంఘాలు చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక మెట్టు దిగి రైతు చట్టాలు రద్దు చేస్తూ రైతులకు క్షమాపణ చెప్పటంతో, ఎపి రైతు సంఘాలు ఆధ్వర్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం నందిగామ గాంధీ సెంటర్ లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. బిజెపి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు చనుమోలు సైదులు మాట్లాడుతూ రైతు చట్టాలు రద్దు చేస్తూ ప్రభుత్వం జిఓలు తెచ్చేంతవరకు పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. రైతు సంఘాలు పోరాట ఫలితంగానే ప్రధానమంత్రి వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తూ ప్రకటన చేశారని అన్నారు. రైతులకు న్యాయం జరిగేవరకు తమ ఆందోళనలు కొనసాగుతుందన్నారు. రైతు సంఘం నాయకులు చుండూరు సుబ్బారావు మాట్లాడుతూ పోరాడితే పోయేది లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ… రైతు పోరాటాలతో బిజెపికీ వణుకు ప్రారంభమైందని తెలిపారు. రైతు చట్టాలు రద్దు వల్ల రైతులకు ఎంతో న్యాయం జరిగిందని తెలిపారు. రైతు సంఘం నాయకులు కటారపు గోపాల్ అధ్యక్షత వహించగా, రైతు సంఘం నాయకులు యర్రా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు వ్డడెల్లిసాంబశివరావు, కాంగ్రెస్ నాయకులు కామా శ్రీనివాసరావు, గోపు నరేంద్ర, రైతు నాయకులు పత్తిపాటి శ్రీనివాసరావు, కర్రి వెంకటేశ్వరరావు, వల్లూరు రవి శేఖర్, జక్కలూరి రవి, పాలేటి పూర్ణ చంద్రరావు, వీరయ్య, పెసరమల్లి శ్యామ్, కనకపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.