సాగుచేసిన ప్రతి ఎకరంలో.. పంటను కాపాడాలి

 

– ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోవద్దు

– రాష్ట్రంలో లోటు వర్షపాతం ప్రధాన సమస్య

– నదుల అనుసందానం, జల సంరక్షణెళి మనకున్న ప్రత్యామ్నాయం

– కరవు మండలాల్లో 150రోజుల పనిదినాలను పూర్తిచేయాలి

– పక్కా ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి

– టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి, నవంబర్‌19(జ‌నంసాక్షి) : సాగుచేసిన ప్రతి ఎకరంలో పంటను కాపాడాలని.. ఎక్కడా ఒక్క ఎకరంలో కూడా పంట ఎండిపోకూడదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సోమవారం అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మన కష్టంతో రాష్ట్రాన్ని ఒకస్థాయికి తీసుకువచ్చామన్నారు. దీనిని తరువాత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణాకు ఇచ్చామని, కృష్ణా జలాలను రాయలసీమకు ఇవ్వగలిగామన్నారు. నదుల అనుసందానం, జల సంరక్షణెళి మనకున్న ప్రత్యామ్నాయం అని బాబు పేర్కొన్నారు. రబీలో సాధారణంకన్నా 30వేల హెక్టార్లలో సాగు పెరిగిందన్నారు. ముందస్తు వరిసాగు శుభ సంకేతమని, ప్రతి ఎకరాలో పంటను కాపాడాలని అధికారులకు సీఎం సూచించారు. వ్యవసాయం నుంచి ఉద్యాన సాగువైపు మళ్లామన్నారు. జాతీయస్థాయిలో 3శాతం వృద్ధి ఉంటే ఏపీలో 11శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ప్రతి ఏడాది 10 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం పెంచాలని అధికారులకు సూచించారు. రాబోయే నాలుగు నెలల్లో మరో రూ.4వేల కోట్ల నరేగా నిధులు వినియోగించాలని ఆదేశించారు. రూ.10వేల కోట్ల నరేగా నిధుల వినియోగమే లక్ష్యమన్నారు. కరవు మండలాల్లో 150 రోజుల పనిదినాలను పూర్తిచేయాలని చెప్పారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పనులు ముమ్మరం చేయాలని, పక్కాఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలరని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.