సాగునీటి రంగంపై..  రూ. 58వేల కోట్లు ఖర్చు చేశాం


– నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు
– ఇప్పటికే 58శాతం పనులు పూర్తయ్యాయి
– ఏపీ మంత్రి నారాయణ
నెల్లూరు, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సాగునీటి రంగంపై గడచిన నాలుగేళ్లలో 58వేల కోట్లను  ప్రభుత్వం ఖర్చు చేసిందని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు సోమశిల జలాశయం వద్ద శనివారం ఆయన జలసిరి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే  58శాతం పూర్తి చేశామని తెలిపారు. పోలవరం నిర్మాణం పనులను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి అప్పగించిన విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు తెలుసుకోవాలని హితబోధ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం, అసత్యాలు ప్రచారం చేయడం, అడ్డగోలు కేసులు వేయడం తప్ప ప్రతిపక్షానికి వేరే పనిలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతిపక్షం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా పని చేస్తుందని మంత్రి నారాయణ ఆరోపించారు.  చంద్రబాబుపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రాన్ని నిలదీయడంతోనే బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఉత్తర తెలంగాణ ప్రజలకు నీటిని అందించేందుకు చంద్రబాబు పోరాడితే దానిని ఇప్పుడు తమ స్వార్థం కోసం వినియోగించుకుంటూ చంద్రబాబుకు అరెస్ట్‌ వారెంట్‌లు జారీ చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇలాంటి కుట్ర రాజకీయాలను ఎన్నో ఎదిరించి తెదేపా నిలబడిందని, ఎవరెన్ని కుట్రలు చేసినా తగిన సమయంలో గుణపాఠం తప్పదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. జలసిరి హారతి కార్యక్రమంలో మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, ఇన్‌ చార్జ్‌ కలెక్టర్‌, ఇతన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు