సాగురైతుల పేరున పట్టాలు ఇవ్వాలి

బందరులో కౌలురైతుల ఆందోళన

విజయనగరం,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): తరతరాలుగా సాగు చేస్తున్న రైతుల పేర్లను అనుభవదారులుగా రికార్డుల్లో చేర్చాలని .. కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బందరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా తూర్పు కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తిదారులకు, దళితులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. మచిలీపట్నం ఫోర్ట్‌ ఏరియాలో అసైన్డ్‌ ప్రభుత్వ భూములను తరతరాలుగా సాగు చేస్తున్న మంగినపూడి, తవిశీపూడి, చినకరగ్రహారం, పల్లిపాలెం, పెదకరగ్రహారం కెంబిల్‌ పేట, సాగుదారుల పేర్లును భూ అనుభవదారులుగా రికార్డులలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల్లాటి శ్రీనివాసరావు, భూ హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ కె.శర్మ, కెవిపిఎస్‌ డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌.రాజేష్‌, సిఐటియు తూర్పు కృష్ణా జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.రవి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శిలం ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.