సామాన్యుని నడ్డి విరిచిన ప్రభుత్వం
భూపాలపల్లి:నిత్యావసర ధరలతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఒక్క సారిగా పెట్రోలు ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచింది ప్రభుత్వం అని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి బందుసాయిలు అన్నారు. ఈ సందర్బంగా పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా యుపిఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. అనంతరం సాయిలు మాట్లాడుతు పెట్రోలు ధరలను అదుపు చేయలేని యుపిఏ ప్రభుత్వం వెంటనే అధికారంలోనుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి 35 సార్లు పెట్రోల్ ధరలను పెంచిన ఘనత వారిదని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగనప్పటికి ప్రభుత్వం ధరలను పెంచటం విడ్డూరంగా ఉందని, ధరలను నియంత్రించలేమని మా చేతుల్లో ఏమి లేదని అధికారంలో ఉండి అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు, పెట్రోలు ధరలు పెరగడం వల్ల పరోక్షంగా నిత్యావసర ధరలు, రవాణా చార్జీలు కూడా పెరిగి సామాన్య ప్రజానికాన్ని ఇంకా నష్ట పరుస్తున్నారని సాయిలు అన్నారు. ధరలను పెంచి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం లూటి చేస్తున్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధరలను తగ్గించాలని లేనిచో సిఐటియు ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజయ్య, వెలిశెట్టి రాజయ్య, మల్లయ్య, బాబు, రమేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.