సాయం కోరి దోచేస్తారు!

– ఇద్దరు కిలాడీ లేడీలను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ మెట్రో పోలీసులు
న్యూఢిల్లీ, ఆగస్టు7(జ‌నంసాక్షి) : ఆపదలో ఉన్నామని, సహాయం చేయాలని కోరుతూ మగవాళ్ల దృష్టిని మరల్చి వారి వద్ద ఉన్న డబ్బు, వస్తువులను దోపిడీ చేస్తున్న ఇద్దరు మహిళలను ఢిల్లీ మెట్రో పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యూఢిల్లీలోని మూల్‌చంద్‌ మెట్రో స్టేషన్‌లో స్వీటీ(24), మస్కన్‌(25) అనే మహిళలను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 4వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌ వద్ద ఓ వ్యక్తి ఇద్దరు మహిళల వెంట పరిగెడుతుండడాన్ని గమనించి వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. ఇద్దరు మహిళలు తనను కొట్టి పర్స్‌ తీసుకొని పారిపోయారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. మహిళల వద్ద మరికొంత మంది పర్సులు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.
‘రాత్రి 9.30 గంటల సమయంలో నేను ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా మెట్రో స్టేషన్‌ సవిూపంలో ఇద్దరు మహిళలు హెల్ప్‌, హెల్ప్‌ అని అరిచారు. నేను బైక్‌ ఆపగానే ముస్కన్‌ అనే మహిళ వచ్చి కొట్టడంతో బైక్‌పై నుంచి కిందపడ్డాను, వెంటనే మరో మహిళ పర్స్‌ లాగేసుకుంది. ఇద్దరూ రింగ్‌ రోడ్డువైపు పారిపోయారు, దీంతో నేను వారి వెంట పరుగెత్తాను అని బాధితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. మహిళలు కూడా నేరాన్ని అంగీకరించారు. తాము డబ్బు కోసమే ఇలా చేస్తున్నామని చెప్పారు. మహిళలు దోపిడీ చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాము కూడా నకిలీ ఫిర్యాదులు చేస్తామని బెదిరించారని బాధితుడు తెలిపాడు. ఢిల్లీలో ఇలాంటి చోరీ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల మరో ఘటనలో చాణక్యపురిలో రూ.75వేలు దొంగిలించిన కేసులో 67ఏళ్ల మహిళను అరెస్ట్‌ చేశారు.