సిడ్నీ ఓపెన్ సానియా జోడీదే…

6666333తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జైత్రయాత్ర ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఇప్పటికే బ్రిస్బేన్ ఓపెన్ నెగ్గిన సానియా-హింగిస్ జోడీ.. అదే జోరును కంటిన్యూ చేస్తూ సిడ్నీ ఇంటర్నేషనల్ ఓపెన్ టైటిల్ సాధించారు. ఫైనల్లో గార్సియా/మ్లడనోవిక్ జోడీపై మూడు సెట్ల పోరులో గెలుపొందారు.

మహిళల డబుల్స్లో అత్యధిక విజయాల ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న సానియా-హింగిస్ జోడీ.. సిడ్నీ ఓపెన్ ఫైనల్లో చెమటోడ్చింది. తొలి సెట్ ను గార్సియా-మ్లడనోవిక్ జంట.. సానియా జోడీకి షాకిచ్చింది. మూడుసార్లు సానియా జోడీ సర్వీసును బ్రేక్ చేసి తొలి సెట్ ను గార్సియా-మ్లడనోవిక్ జోడీ 6-1తో నెగ్గింది.

తొలి సెట్ ఓడినా.. రెండో సెట్ కొచ్చేసరికి వరల్డ్ నెంబర్ జోడీ పుంజుకుంది. తమ సర్వీసులను కాచుకుంటూ 5-5తో సమంగా సాగారు. ఈ దశలో సానియా జోడీ ప్రత్యర్థిపై ఆధిక్యం చాటింది. ప్రత్యర్థి సర్వీసును కొల్లగొట్టడమే గాక తమ సర్వీసును నిలుపుకుంటూ రెండో సెట్ ను 7-5తో నెగ్గి సమవుజ్జీగా నిలిచారు.

ఫలితం తేల్చే మూడో సెట్ లోనూ సానియా-హింగిస్ జోడీ విజృంభించింది. 10-5తో సెట్ ముగించింది. గంట 13 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ పోరులో ప్రత్యర్థి జోడీపై గెలిచి 30వ గెలుపును ఖాతాలో వేసుకుంది. సిడ్నీ ఓపెన్ ఈ ఏడాది వీరికి రెండో టైటిల్. 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్ల రికార్డును ఛేదించాలంటే సానియా జోడి ఇంకా 15 మ్యాచ్లు నెగ్గాల్సి ఉంటుంది.