సిడ్నీ వన్డేలో భారత్ లక్ష్యం 331
సిడ్నీ: భారత్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మరోసారి టీమిండియాకు 330/7తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటి వరకు సిరీస్‌లో జరిగిన నాలుగు వన్డేల్లోనూ నిరాశపరిచిన భారత్ బౌలర్లు తొలిసారిగా సిడ్నీలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసేలా కనిపించారు. ఆదిలోనే ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్(6)ను ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు పంపగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్(28)ను అరంగేట్రం బౌలర్ బుమ్రా బోల్తా కొట్టించాడు. మూడో వికెట్ రూపంలో జార్జ్ బెయిలీ(6) కూడా జట్టు స్కోరు 78 పరుగుల వద్దే రిషిధావన్ బౌలింగ్‌లో ఔటవడంతో ఆసీస్ 78/3తో ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది.
శతకంతో ఆదుకున్న వార్నర్
ఒకవైపు సహచరుల వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. గతి తప్పిన బంతుల్ని భారీ షాట్లతో బౌండరీలకు తరలిస్తూ వచ్చిన వార్నర్ (122: 113 బంతుల్లో 9×4, 3×6) వన్డే కెరీర్‌లో ఐదో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్ (102 నాటౌట్: 84 బంతుల్లో 9×4, 2×6)తో కలిసి ఐదో వికెట్‌కి 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వార్నర్ జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. వార్నర్ ఔట్ అనంతరం మాథ్యూ వెడ్ (36) ఫర్వాలేదనిపించినా.. ఆల్‌రౌండర్ పాల్కనర్ (1) నిరాశపరిచాడు. వార్నర్ సమయోచిత శతకానికి మిచెల్ మార్ష్ దూకుడు తోడవడంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేయగలిగింది. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2, జాస్‌ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, రిషిధావన్ చెరో వికెట్ తీశారు. షాన్ మార్ష్ రనౌట్‌గా వెనుదిరిగాడు.