సినిమా టిక్కెట్ల ధరలపై ధర్మాసనానికి అప్పీల్
విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి,డిసెంబర్15 (జనంసాక్షి):- రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం గురురానికి వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజినల్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే సింగిల్ జడ్జి తీర్పు కాపీ అందకపోవటంతో నేడు విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. వెంటనే విచారించకపోతే ఇష్టానుసారం టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ఉదయం మొదటి కేసుగా తీసుకుందామని హైకోర్టు పేర్కొంది. సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ప్రభుత్వం తరుపు వాదనలు వినాలని ఏజీ హైకోర్టును కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను హైకోర్టు సస్పెండ్ చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.