సిపిఐ జిల్లా ద్వితీయ మహాసభను ప్రారంభించిన నారాయణ

మోడీ విధానాలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం

కెసిఆర్ ఆటో ఇటో తేల్చుకోలేని పరిస్థితి

జిల్లా ద్వితీయ మహాసభలో సిపిఐ నారాయణ

 

పినపాక నియోజకవర్గం జూలై 28 (జనం సాక్షి): భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభలు గురువారం మణుగూరులోని మైస కొండయ్య నగర్ (కిన్నెర కళ్యాణ మండపంలో) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ నాయకులు నారాయణ మహాసభలను ప్రారంభించి మాట్లాడారు మోడీ విధానాలు దేశాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడి కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో నడుస్తోందని, అన్యాయాలు, అక్రమాలపై ఉక్కుమాదం మోపాల్సిన సంస్థలు పాలకుల అడుగులకు మడుగులోత్తడం దురదృష్టకరమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బిజెపి పాలకులు అరాచకాలకు పాల్పడుతున్నారని మతతత్వాన్ని ప్రజల్లో గుప్పించి భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తూ జాతి సంపదను సంపన్న వర్గాల వారికి దారా దత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసరాల ధరలు నానాటికి అందని ద్రాక్షగా మారాయని, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలకు పెను భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ వారిపై కత్తి కట్టారని మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాలను వెనక్కు తీసుకునే అంతవరకు చేసిన పోరాటం ఎంతో గొప్పదని, మోడీ ఇప్పటికైనా తాను ఒంటెద్దు పోకడలకు పోతున్నట్లు గుర్తించాలని హితవుపలికారు. ఇలాంటి తప్పుడు ప్రభుత్వాలను తిప్పికొట్టే శక్తి కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని, ఏకపన్ను, ఏక విధానం, ఏక నాయకుడు అనే నియంతృత్వ ధోరణిలో మోడీ పాలన ఉందన్నారు. పాలకుల కు వ్యతిరేకంగా లోపాలు లేని ప్రజా పాలిత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్రపతి వ్యవస్థ రబ్బరు స్టాంపుల మారిందని, గత రాష్ట్రపతి చేసింది కూడా అదే అన్నారు. ప్రస్తుత రాష్ట్రపతిగా ఎంపికై ద్రౌపది మురుమని ఎంపిక చేసుకుంది కూడా అందుకే అన్నారు. ఎర్రజెండాల పోరాట ఫలితంగా వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేయించేందుకు ఆమెతో సంతకం చేయించేందుకు బిజెపి సిద్ధంగా ఉందని, దీంతో గిరిజనులకు కూడా అన్యాయం జరగడం ఖాయం అన్నారు. అడవుల్లో అనేక నిక్షేపాలు ఉన్నాయని వాటిని బడా కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం వేచిస్తోందన్నారు. ఈ మోడీ కారణంగా భారత లౌకికవాదానికి పెను ముప్పు పొంచి ఉందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీచులు ఆటలకు దిగుతున్నారని, గోదావరి వరదలు సాకుతో ఒకరిపై ఒకరు తప్పులు మోపికునే పనిలో పడి ప్రజా శ్రేయస్సును మరిచి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే వాదనను తెరపైకి తేకుండా పోలవరం పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపిని విమర్శిస్తూనే ఢిల్లీకి పోయి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ దేశ రాజకీయాలను శాసిస్తానంటూ చెబుతున్నారని, స్వరాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తనకు తాను చేసుకోలేని వాడు దేశం మొత్తానికి ఏం మేలు చేస్తాడని ప్రశ్నించారు. ప్రజలను పట్టిపీడిస్తున్న సామ్రాజ్యవాద శక్తులని తరిమికొట్టే శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని. సమస్యలు ఎక్కడుంటే కమ్యూనిస్టులు అక్కడ ఉంటారని కార్యకర్తలు నాయకులు ఉద్యమాల కోసం వెతకాల్సిన అవసరం లేదని ప్రజల్లో ఉంటే అవే పుట్టుకొస్తాయని ఇందుకోసం కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కునంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు మిర్యాల రంగయ్య, బందుల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, ముత్యాల విశ్వనాథం ఎస్ పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, కే సారయ్య , ఏపూరి బ్రహ్మం, ఎస్డి సలీం, తమ్ముళ్ల వెంకటేశ్వరరావు, రావులపల్లి రవికుమార్, నరాటి ప్రసాద్, కల్లూరు వెంకటేశ్వరరావు, కమటం వెంకటేశ్వర్లు, దుర్గరాశి వెంకటేశ్వర్లు, వై శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు