సిపిఐ మహాగర్జన బస్సుయాత్ర
హాజరైన సుభాషిణి అలీ
అనంతపురం,ఆగస్టు29(జనం సాక్షి): అనంతపురంలో సిపిఎం-సిపిఐ బస్సు యాత్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో బుధవారం ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సెప్టెంబర్ 15న విజయవాడలో చేపట్టనున్న మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ..సిపిఎం-సిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్రను ప్రారంభించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సిపిఎం కేంద్ర కమిటి సభ్యులువి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం, సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. జిల్లాలో ప్రారంభించిన ఈ బస్సు యాత్ర 29, 30 తేదీల్లో పూర్తి చేసుకొని కర్నూలు జిల్లాకు చేరుకుంటుంది. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల గుండా సాగి విజయవాడకు చేరుకోనుంది.