సిమికోట్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
– మంచు విపరీతంగా కురుస్తుండటంతో నిలిచిపోయిన హెలికాప్టర్ సర్వీస్‌లు
– ఆరు రోజులుగా యాత్రికుల అగచాట్లు
– యాత్రికులను స్వదేశానికి తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు
అమరావతి, ఆగస్టు6(జనం సాక్షి) : మానససరోవర్ యాత్రకు వెళ్లి అక్కడకు చిక్కుకున్న తెలుగు వారి పరిస్థితి దయనీయంగా మారింది. వాతావరణ అనుకూలించకపోవడంతో తిరిగి వచ్చే మార్గం లేకపోవడంతో ఆరు రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. దాంతో సరైన ఆహారం, నీరు అందకపోవడంతో తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు తెలుగువారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. దాదాపు 90 మంది తెలుగు యాత్రికులు మానససరోవరం యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా నేపాల్‌లోని సిమికోట్ వద్ద చిక్కుకుపోయారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో హెలికాఫ్టర్ సర్వీస్‌లను అక్కడ అధికారులు నిలిపివేశారు. దాంతో యాత్రికులంతా అక్కడకే చిక్కుకుపోవాల్సి వచ్చింది. అలా చిక్కుకుపోయిన వారిలో ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ భర్త షేక్ ముజుబూర్ రెహ్మాన్, బంధువులు ఉన్నారు. సిమికోట్‌లో ఉన్న యాత్రికులు…అక్కడి పరిస్థితిని తమ బంధువులకు ఫోన్ల ద్వారా వివరించారు. వాతావరణం అనుకూలిస్తే యాత్రికులు అందరినీ నేపాల్ గంజ్ తరలిస్తామని అక్కడ అధికారులు తెలిపారు. అయితే హిమపాతం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తరలింపు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దాంతో బంధువుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఏలూరు మేయర్ భర్తతో పాటు తెలుగువారందరినీ స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు… కేంద్రవిదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను కోరారు. వారు సానుకూలంగా స్పందించారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మరోపక్క ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రంతో సంప్రదింపులు జరుగుతోంది.