సిరియాపై మరోసారి ఫ్రాన్స్‌ వైమానిక దాడులు

2హైదరాబాద్‌: పారిస్‌లో నరమేధం సృష్టించిన ఇస్లామిక్‌స్టేట్‌పై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఫ్రాన్స్‌ అధికారులు ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి సిరియాలో వైమానిక దాడులు చేపట్టారు. ఆదివారం రాత్రి కూడా ఫ్రాన్స్‌ అధికారులు సిరియాలోని రెక్కా నగరంపై వైమానిక దాడులు చేసి ఇస్లామిక్‌ స్టేట్‌ శిక్షణా శిబిరాన్ని కూల్చివేశారు. ఇప్పుడు మళ్లీ దాడులు చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గత శనివారం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు పారిస్‌లో విచాక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పాటు ఆత్మాహుతి దాడికి పాల్పడగా.. 129మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
– సిరియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో ఏడు సార్లు వైమానిక దాడులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
– ఈ దాడుల్లో ప్రాణ నష్టం వివరాలు మాత్రం తెలియరాలేదని వారు పేర్కొన్నారు.
– పారిస్‌లో ఉగ్రదాడిపై చర్చించేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ¬లాండే వచ్చేవారం అమెరికా, రష్యా దేశాలకు వెళ్లనున్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్యలు జరపనున్నట్లు సమాచారం.
దాడులను విస్తృతం చేసిన ఫ్రాన్స్‌
పారిస్‌పై ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రదాడికి ఫ్రాన్స్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. దేశవ్యాప్తంగా ఫ్రాన్స్‌ అధికారులు దాడులను విస్తృతం చేశారు. మంగళవారం ఉదయం 128ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధం ఉందని భావిస్తూ.. 23మంది అనుమానితులను అరెస్టు చేశామని.. వారి వద్ద నుంచి 31ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.