సీఎంపై వారెంట్ ఇవ్వడం.. దేశచరిత్రలో లేదు
– ఎన్డీఏ నుంచి బయటకురాగానే నాన్‌బెయిల్ వారెంట్ ఇవ్వటం కుట్రకాదా?
– తెలంగాణ ఏడారి కాకూడదనే ఆరోజు పోరాడాం
– 80మందిని కాలేజీలో ఒకే గదిలో బంధించారు
– మూడు రోజులు నరకయాతన అనుభవించాం
– మహిళా నేతల ఇబ్బందులు చూసి బాబు కన్నీరు పెట్టుకున్నారు
– శవాల వ్యాన్లలో మమ్మల్ని తరలించారు
– కుట్రలను తిప్పికొట్టేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– వెంటనే అరెస్ట్ వారెంట్‌ను వెనక్కు తీసుకోవాలి
– విలేకరుల సమావేశంలో సీనియర్ నేత నామా నాగేశ్వరరావు
హైదరాబాద్, సెప్టెంబర్14(జనంసాక్షి) : రాష్ట్ర ముఖ్యమంత్రిపై అరెస్ట్ వారెంట్ ఇవ్వడం దేశ చరిత్రలో లేదని టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు విూద నాన్ బెయిల్ కేసు పెట్టడం దారుణం. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు కట్టడం కారణంగా తెలంగాణ ఎడారి అయిపోతుందన్న ఆవేదనతోనే టీడీపీ ఆందోళనకు దిగిందని తెలిపారు. ఓపక్క తాము బాబ్లీ కట్టడం లేదని చెబుతూ, మరోవైపు శరవేగంగా దాన్ని మహారాష్ట్ర పూర్తి చేసిందని వెల్లడించారు. దీంతో తామంతా కలసి ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లామన్నారు. మహారాష్ట్రలోకి తాము ప్రవేశించకముందే తెలంగాణలో ఉండగానే బోర్డర్ కు వేలాది మంది పోలీసులు చేరుకున్నారని తెలిపారు. అక్కడి నుంచి తమను బలవంతంగా లాక్కునిపోయారని వెల్లడించారు. అక్కడ సవిూపంలోని ఓ కాలేజీలో చిన్నగదిలో 80 మందిని బంధించారని వెల్లడించారు. తమతో 10 మంది మహిళా నేతలు ఉన్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. అక్కడకు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చల్లగా చెప్పారన్నారు. ఆ రాత్రంతా తాము నరకం అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. పడుకొనేందుకు స్థలం లేకుండా పోయిందన్నారు. కనీసం మంచి నీళ్లు, బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పించలేదని వెల్లడించారు. తమను బంధించిన ఆ కాలేజీ గదిని జైలుగా మార్చేశారని నామా అన్నారు. కనీసం పరిశుభ్రత కూడా లేకపోవడంతో టీడీపీ మహిళా నేతలే ఈ గది అంతటిని శుభ్రం చేశారన్నారు. మేము ఇక్కడికి గొడవలకు రాలేదు, గొడవలు చేయలేదు, ఓ భారతీయ పౌరుడిగా నేను ఇక్కడికి బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు నా పార్టీ నేతలతో కలసి వచ్చా అని చంద్రబాబు చెప్పినా ఎవ్వరూ వినలేదని వాపోయారు. మూడోరోజు రాత్రిపూట శవాలను తరలించే రెండు వ్యాన్లలో 80మంది టీడీపీ నేతలను కుక్కారన్నారు. వ్యాన్లలో ఎక్కించిన అనంతరం వాటికి బయటి నుంచి తాళం వేసి పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహారశైలితో టీడీపీ నేతలు ముఖ్యంగా మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారని వెల్లడించారు. విూరు ఎక్కడి తీసుకెళ్లినా వస్తాం, కానీ మమ్మల్ని పద్ధతిగా తీసుకెళ్లండి అని ఆయన అడిగారన్నారు. అప్పట్లో ముగ్గురు టీడీపీ నేతల ఆరోగ్యం చెడిపోవడంతో అక్కడే సెలైన్స్ ఎక్కించాల్సి వచ్చిందని తెలిపారు. మేము ఎన్డీయే నుంచి బయటకు రాగానే నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వడం కుట్ర కాదా అని నామా ప్రశ్నించారు. కేసులు లేవని చెప్పి ఏమిదేళ్ల తర్వాత వారెంట్ ఇవ్వడం కుట్ర కాదా అని నామా
నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై వారెంట్ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదన్నారు. ఎనిమిది సెక్షన్ల కింద కేసులు ఎందుకు పెట్టారని నిలదీశారు. వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని, తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలని నామా డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.ఈ విలేకరుల సమావేశంలో టీటీడీపీ అధ్యక్షులు ఎల్. రమణ, పెద్దిరెడ్డిసుదర్శన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
అక్కడ నరకం అనుభవించాం – రావుల
మహారాష్ట్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నాన్ బెయిల్ కేసు పెట్టడం దారుణమని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆనాడు తెలంగాణ బోర్డర్‌లో ఉండగానే మమ్మల్ని అరెస్ట్ చేసి ధర్మాబాద్‌లో పెట్టారని అన్నారు. ఒకే గదిలో మమ్మల్ని 80 మందిని నిర్బంధించారని, అక్కడ నరకం అనుభవించామని రావుల పేర్కొన్నారు. తెలంగాణ కోసం అక్కడ అనేక బాధలు పడ్డామని అన్నారు. కేసులు లేవని చెప్పి ఏమిదేళ్ల తర్వాత వారెంట్ ఇవ్వడం కుట్ర కాదా అని రావుల ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై వారెంట్ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని ఎనిమిది సెక్షన్ల కింద కేసులు ఎందుకు పెట్టారో చెప్పాలని, తక్షణం కేసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం సమన్లు ఇవ్వకుండా వారెంట్ ఇవ్వడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై వెళితే కేసులు పెడతారా అంటూ రావుల మండిపడ్డారు. దీనిపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని ఆయన అన్నారు.