సీఎం ఎదుట అధికారుల చిట్టావిప్పుతా

– అనంతపురంలో ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నాయి
– కలెక్టర్‌, జేసీలకు ఫిర్యాదులు చేసినా తప్పుడు నివేదికలు ఇస్తున్నారు
– జిల్లాలో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది
– ఆగ్రహం వ్యక్తం చేసీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
అనంతపురం, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : సీఎం ఎదుట అధికారుల చిట్టా విప్పుతా అంటూ పోలీసులు, అధికారులపై అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసు పేరుతో నేరస్తులకు దండంపెట్టి ఎదుట కూర్చోబెట్టుకుంటున్నారని విూడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురం నగరంలో ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నా పట్టించుకునే అధికారి లేడంటూ తీవ్రంగా ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌, జేసీలకు తాను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు. జిల్లాలో పోలీసు వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వీర్యమైపోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని జేసీ ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని ఉద్దేశించి జేసీ అనేక ఆరోపణలు చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వల్ల తాను అనంతపురంలో ప్లాస్టిక్‌ వాడకం నిరోధించలేకపోయామని, రోడ్లు విస్తరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని అధికారుల చిట్టాను ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ముందుంచుతానని చెప్పారు. ఈ క్రమంలో విూడియాను జేసీ వదిలిపెట్టలేదు. అనంతపురంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నా విూడియా ప్రతినిధులు కళ్లుమూసుకొని కూర్చున్నారంటూ మండిపడ్డారు.

తాజావార్తలు