సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గం సమావేశం
కోల్‌కతా: సీఎం మమతా బెనర్జీ తన కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. అయితే కేబినెట్‌లో స్వల్ప మార్పులే ఉంటాయా లేక మంత్రివర్గం మొత్తాన్ని మారుస్తారా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు అనంతరం కేబినెట్‌లో మార్పులు చేస్తామని మమతా బెనర్జీ గతవారమే తెలిపారు. అప్పటివరకు ఆయన శాఖలన్నీ తనవద్దే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కేబినెట్ భేటీ జరుగుతోంది. పార్థ చటర్జీ శాఖలను పార్టీలోని ఇతర నేతలకు అప్పగిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే కేబినెట్‍లో సమూల మార్పులుంటాయా అనే విషయంపై మాత్రం తమకు తెలియదని పేర్కొన్నాయి.పార్టీలో ఒక్కరికి ఒకే పదవి ఉండాలని మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలోనే చెప్పారు. ఆ నిబంధన మేరకు ఇకపై ఒక్క మంత్రికి ఒకే శాఖ కేటాయించాలనే యోచనలో మమత ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీని ఈడీ ఇటీవలే అరెస్టు చేసింది. ఆయన సన్నిహితురాలు నటి అర్పిత ముఖర్జీ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.50కోట్ల నగదు, బంగారు ఆభరణాలను జప్తు చేశారు. అనంతరం పార్థ చటర్జీని మంత్రి పదవిని తొలగించమే గాక, పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించారు సీఎం మమతా బెనర్జీ. ఆ సమయంలో ఆయన వద్ద ఐదు శాఖలు ఉండటం గమనార్హం.