పశ్చిమ బెంగాల్ పోస్టర్ కలకలం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని దుర్గా మాతగా, ప్రధాని నరేంద్ర మోదీని మహిషాసురుడిగా చూపుతూ వెలిసిన పోస్టర్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ పోస్టర్ ప్రధానిని అవమానించేలా ఉందని, ఇది సనాతన ధర్మానికి విరుద్ధమని కాషాయ పార్టీ నేత భగ్గుమన్నారు. ఈ పోస్టర్ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. మిడ్నపూర్ జిల్లాలోని ఓ వార్డు నుంచి బరిలో నిలిచిన టీఎంసీ నేత అనిమ సాహ అనుచరులు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో దీదీని దుర్గామాతగా చూపగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మహిళాసురుడితో పోల్చారు. విపక్ష పార్టీలను గొర్రెలుగా చూపరు. విపక్షాలకు ఓటు వేస్తే వాటిని బలిపశువును చేసినట్టేనని పోస్టర్‌లో రాసుకొచ్చారు. జిల్లాలో ఈ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. స్ధానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య ఈ వ్యవహారంపై స్పందించారు. నాయకులను దేవతలుగా చూపడం సనాతన ధర్మాన్ని అవమానించడమేనని అన్నారు. ప్రధాని, హోంమంత్రిని రాక్షసులుగా చూపడం వారిని అవమానించడమేనని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేస్తుందని విపుల్ ఆచార్య వెల్లడించారు. ఈ పోస్టర్ వ్యవహారం తనకు తెలిసిఉంటే తాను ఈ ప్రాంతంలో ఇలాంటి పోస్టర్‌లకు అనుమతించేవాడిని కాదని టీఎంసీ నేత అనిమ సాహా చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 27న బెంగాల్‌లో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో పోస్టర్ వివాదం వెలుగుచూసింది.