సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి జి.పి.లో వైద్య శిభిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
మహబూబాబాద్, జూలై -21:
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి జి.పి.లో వైద్య శిభిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి జిల్లాలోని వైద్య అధికారులతో వీడియో సమావేశం ద్వారా మెడికల్ క్యాంప్ ల ఏర్పాటు, ప్రజల ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పి.హెచ్.సి.ల వారీగా, మండలాల వారీగా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 461 జి.పి.లలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడంతో పాటు శాంపిల్ కలెక్షన్ పెంచాలని, 21 పి.హెచ్.సి. పరిధిలో ఉన్న గ్రామాలను మొత్తం కవర్ చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో 15 రోజుల్లో వైద్య శిబిరాలు ముందుగా ఏర్పాటు చేయాలని, ఆగస్ట్ లోగా మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. జి.పి.భవనం వద్ద, సబ్ సెంటర్ వద్ద వైద్య శిభిరం ఏర్పాటు చేయాలని, పాఠశాలల్లో ఏర్పాటు చేయవద్దని తెలిపారు. అలాగే గడప గడపకు వెళ్లి ఫీవర్ సర్వే చేయాలని, సర్వే కు వెళ్ళిన సందర్భంలో ఇంతకు ముందు ఇచ్చిన దోమ తెరలను వాడుతున్నారా లేదా గమనించాలని తెలిపారు. వైద్య శిబిరాలను రైతులు పొలాలకు వెళ్ళే సమయంలో కాకుండా, అందుబాటులో సమయంలో ఏర్పాటు చేసి పరీక్షించాలని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. అంబరీష, ఉమా గౌరీ, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధీర్ రెడ్డి, బిందు శ్రీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.