సీపీఎస్‌ రద్దుకోరుతూ..  ఉపాధ్యాయల సంఘాల చలో అసెంబ్లీ .. 

– అమరావతిలో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
– ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు
– ప్రభుత్వం తీరుపై మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు
అమరావతి, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : కంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ విధానం రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అమరావతిలోని అసెంబ్లీ, కృష్ణానది కరకట్ట, మంగళగిరి రహదారి, జాతీయ రహదారిపై ఎన్నడూ లేనంత భారీగా పోలీసులను మోహరించారు. ప్రకాశం బ్యారేజీ, కరకట్ట వారధి, మందడం తదితర ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు, ఆ మార్గాల్లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టూ పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేసి, ఆందోళనకారులు లోనికి చొరబడకుండా పటిష్ట కాపలా ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లోని పలువురు ఉపాధ్యాయులను ఇప్పటికే బైండోవర్‌ చేసి వారిని గృహనిర్బంధం చేశారు. పోలీసుల కళ్లుగప్పి ఉండవల్లి, సీతానగరం చేరుకున్న ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని తాడేపల్లి, మంగళగిరి పోలీసు స్టేషన్లకు తరలించారు. వివిధ
ప్రాంతాల నుంచి రహస్యంగా అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సుమారు 400 మందిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి భారీ ర్యాలీగా బయలుదేరడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించాయి. దీంతో ఉపాధ్యాయులకు, పోలీస్‌లకు తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కారులను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం సాయంత్రం నుంచే ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. బస్సులు రద్దు
వారి సొంత మండలాల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇక విజయనగరం జిల్లా నుంచి అమరావతికి వెళ్లోన్న యూటీఎఫ్‌ సభ్యులను విశాఖపట్నంలో అరెస్ట్‌ చేశారు. రైల్లో ప్రయాణిస్తున్నవారిని కంచరపాలెం ఎస్‌ఐ వెంబడించి మరీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అర్టీసీ సైతం అమరావతికి బస్సులను రద్దుచేసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు.. స్కూల్‌ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్ని కూడా తనిఖీలు చేశారు. తిరువూరు నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్తున్న 20 మంది ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌లపై శాసనమండలిలో పీడీఎఫ్‌ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా.. మండలి చైర్మన్‌ దానిని తిరస్కరించారు. దీంతో సీపీఎస్‌ రద్దుతో పాటు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌పై మండలిలో చర్చ చేపట్టాలని పీడీఎఫ్‌ సభ్యులు చైర్మన్‌ పోడియం ముందు నిరసనకు దిగారు. సీపీఎస్‌ రద్దు చేయమంటే అక్రమ అరెస్టుల చేస్తారా అని మండిపడ్డారు. ఉపాధ్యాయులు అనుకుంటున్నారా.. ఉగ్రవాదులు అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కూళ్లలోకి వెళ్లి ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయాల్సిన అవసరమేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ రద్దుపై మండలిలో వెంటనే చర్చ జరపాలని.. దీనిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని పీడీఎఫ్‌ సభ్యులు పట్టుబట్టారు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీడీఎఫ్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
సీపీఎస్‌ రద్దుచేసే వరకు పోరాటం చేస్తాం – ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు
సీపీఎస్‌కు తాము వ్యతిరేకమని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, బొడ్డు నాగేశ్వరరావు,
యాండపల్లి శ్రీనివాసరెడ్డి, రామసూర్యారావు, నరసింహారెడ్డి విూడియాతో మాట్లాడుతూ సీపీఎస్‌పై అసెంబ్లీ చివరి రోజు చర్చించడం వల్ల ప్రయోజనమేంటి? అని వారు ప్రశ్నించారు. సీపీఎస్‌పై కమిటీ వేస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోందని, దీని వల్ల సమస్యను పొడిగించడమే తప్ప ప్రయోజనం లేదన్నారు. సీపీఎస్‌ రద్దు కోసం రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా టీడీపీ తన వైఖరి చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చి సీపీఎస్‌ రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.

తాజావార్తలు