సీబీఐలాంటి సంస్థలు మోడీచేతిలో ఉంటే.. దేశానికే ప్రమాదం
– రాష్ట్రాలకున్న హక్కులను కాలరాస్తున్నారు
– సీబీఐలో సంక్షోభం వల్లే ‘సమ్మతి’ని ఉపసంహరించుకున్నాం
– రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారమే అలాచేశాం
– బీజేపీ మళ్లీ గెలిస్తే జాతీయ పతాకాన్ని మార్చేస్తుంది
– ఏపీ ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు
అమరావతి, నవంబర్17(జనంసాక్షి) : సీబీఐలో నెలకొన్న సంక్షోభం వల్లే ఏపీలో ‘సాధారణ సమ్మతి’ని
ఉపసంహరించామని మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ సాధనం కారాదన్నారు. రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశానికి సమ్మతి ఉపసంహరణ సబబే అని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారమే చేశామని తెలిపారు. ఏపీ స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాలూ అదే నిర్ణయం తీసుకోవాలని యనమల కోరారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈజీవో తెచ్చామన్నారు. సహకార సమాఖ్య అని బీజేపీ నేతలు ఊదరగొట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే కేంద్ర బలగాలు రావాలని యనమల మరోసారి స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు కూడా రాష్ట్రాల అనుమతి అనివార్యమన్నారు.
సీబీఐని తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనేది మోదీ దుర్బుద్ధి అని మండిపడ్డారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని మోదీ దెబ్బతీశారని మండిపడ్డారు. సంక్షోభంలోకి సీబీఐని నెట్టింది ప్రధాని నరేంద్ర మోడీ కాదా అని యనమల ప్రశ్నించారు. ఏ1, ఏ2లు పీఎంవోలో తిరగడం గతంలో చూశామా అని అన్నారు. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ పరస్పర ఆరోపణలు ఎప్పుడైనా చూశామా? అని యనమల అడిగారు. రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలపై కక్ష సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయడమే మోదీ, షా లక్ష్యమని మంత్రి వ్యాఖ్యానించారు. రాజ్యాంగపరంగా రాష్ట్రాలకున్న హక్కులను మోదీ కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యానికి అంత బలమన్నారు. వ్యవస్థల పతనాన్ని నిరోధించడమే టీడీపీ సిద్ధాంతమని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. 2019లో బీజేపీని గద్దె దించడమే అందరి బాధ్యత అని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
దేశంలో నగరాల పేర్లు మార్చడం బీజేపీ నేతల తుగ్లక్ చర్య అని యనమల వ్యాఖ్యానించారు. నగరాల పేర్లు మార్చినట్లే రాజ్యాంగాన్ని మార్చేస్తారన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే జాతీయ పతాకాన్ని మార్చేస్తుందని మంత్రి తెలిపారు. దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తారన్నారని, భిన్నత్వంలో ఏకత్వాన్ని మార్చేస్తారని మంత్రి యనమల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.