సీమాంధ్రలో జోరుగా సీఎం పర్యటన
చేనేతను ఆదుకుంటాం
ఆటవిడుపుగా విద్యార్థులతో క్రికెట్ ఆడిన కిరణ్
హైదరాబాద్, జూలై 15 (జనంసాక్షి):
మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహనంతో, సంయ మనంతో వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తూర్పుగో దావరి జిల్లా రంపచోడవరంలో విలేకరులతో మాట్లాడారు. ఐఎఎస్ అధికారులపై మంత్రి టిజి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆలోచించి మాట్లాడాలన్నారు. ఏదేదో మాట్లాడడం మంచిపద్ధతి కాదన్నారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవేనని చెప్పారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మనిషేనని.. ఆయన అమలు చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన పథకాలని చెప్పారు. వ్యక్తులకు పథకాలుం డవని చెప్పారు. ముసురుమిల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయ రంగంతో అనుసంధించాల్సిన ఆవశ్యకతను, అంశాన్ని ప్రధాని మన్మోహన్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామని తెలిపారు. ఉపాధి హామీ పధకం అమలులో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. కూలీలకు ఎక్కువ పనిదినాలను కల్పించి, పథకం నిరంతరం కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం ఆయన అమలాపురానికి బయల్దేరి వెళ్లారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మబాటను శనివారంనాడు గోకవరంలో ప్రారంభించడం.. మూడు రోజుల పాటు తూర్పుగోదావరిజిల్లాలో ఇందిరమ్మబాట నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండో రోజైన ఆదివారంనాడు ఆయన అమలాపురం, ద్రాక్షారామం, కాకినాడ, తాళ్లరేవు, బండారులంకలలో పర్యటించనున్నారు. రాత్రికి కాకినాడలో బసచేస్తారు.
తొలిరోజు..ఇలా..
ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిరోజు ఇందిరమ్మబాటను విజయవంతంగా ముగించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి ఆటల్లో పాల్గొన్నారు. స్కిప్పింగ్, క్రికెట్ ఆడారు. పిల్లలతో మమైకమైపోయారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు సైతం ఆయన్ను అభినందించారు. అంతేగాక మొక్కలు నాటారు. మొక్కల ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు. రంపచోడవరం ఏజెన్సీ బోర్నగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అక్కడే ఆయన రాత్రి బస చేశారు.