సుద్దరేవు మసివాగులో రైతు గల్లంతు…లభ్యంకాని ఆచూకీ
బయ్యారం,జులై16(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్దరేవు గ్రామం మసివాగులో వాగు దాటుతున్న క్రమంలో రైతు గల్లంతైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.కొట్టెం జనార్దన్(40)అనే రైతు పొలం పనులు పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో సాయంత్రం 5గంటల సమయంలో వాగు దాటుతున్న క్రమంలో అదుపుతప్పి ప్రమాదావశాత్తు వాగులో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన వాగులో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.దాదాపు మూడు గంటలు శ్రమించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. విషయం తెలుసుకున్న బయ్యారం తహసీల్దార్ రమేష్ బాబు, సిఐ బాలాజీ,ఎస్ఐ రమాదేవి ఘటనా స్థలానికి చేరుకొని శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.ఈ సందర్బంగా బయ్యారం తహసిల్దార్ మాట్లాడుతూ… శనివారం ఉదయం 8 గంటల నుండి గాలింపు చర్యలు మొదలు పెట్టామని, గ్రామస్తులు, అధికారులు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారని, ఆచూకీ లభ్యమయ్యేంతవరకు గాలింపు చర్యలను ఆపబోమని స్పష్టం చేశారు.
వంతెనకు మోక్షం ఎన్నడో!?
ఎన్నో సంవత్సరాల నుండి వాగు దాటి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లవలసి వస్తుందని, దాదాపు 150 కుటుంబాలు ఈ వాగు దాటే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికీ వాగు దాటే సందర్భంలో ఎన్నో ప్రమాదాలలో జరిగాయని, ఎంతో ప్రాణనష్టం కూడా జరిగిందని, ఇకనైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి మసివాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుకున్నారు