సుద్ద తరలింపులో రాయల్టీకి ఎగనామం?
ఆదాయం కోల్పోతున్న సర్కార్
వికారాబాద్,జూన్20(జనంసాక్షి): సుద్దకు చాలామంది యజమానులు రాయల్టీ చెల్లించకుండా పరిశ్రమలకు తరలిస్తున్నారు. ఇలా చేయడంతో గనుల శాఖకు సమకూరాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు వేగంగా స్పందించడంలేదు. లీజు ముగియడానికి గడువు ఇంకా ఉండటంతో తమ గనులకు పక్కనే ఉన్న భూముల్లో తవ్వేస్తున్నారు. చిన్నతరహా ఖనిజాల పరిధిలోకి వచ్చే సుద్ద అక్రమ రవాణా తవ్వకాలు, రవాణా జిల్లాలో యథేచ్ఛగా సాగిపోతుంది. జిల్లాలోని గనుల నుంచి సుద్ద బయటికి
వస్తోంది. అదేస్థాయిలో హైదరాబాద్, వికారాబాద్, మర్పల్లి, ఒగులాపూర్ గ్రామాల సవిూపంలోని పరిశ్రమల తోపాటు కర్ణాటక, మహరాష్ట్రలోని పరిశ్రమలకు తరలుతోంది. ముఖ్యంగా మలేషియా, సింగపూర్ లకు తరలివెళ్లే సుద్దను చమురును శుద్ధి చేసేందుకు వాడుతున్నారు. ముఖ సౌందర్య వినియోగానికి సంబంధించిన ఉత్పత్తులు, ఎరువుల తయారీకి సైతం ఉపయోగపడుతుంది. దేశీయంగా మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్టాల్ల్రో ఎరువుల తయారీలో వినియోగిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండలం మారెపల్లి, ఇందోల్, ఒగులాపూర్, రుద్రారం, గోపాల్‌పూర్, తింసాన్‌పల్లి, మోమిన్‌పేట మండలం టేకులపల్లి, ధారూర్ మండలం జైదుపల్లి, మర్పల్లి మండలం కోట్‌మర్పల్లి గ్రామాల సవిూపాల్లో లీజులు పొందిన సుద్దగనులు వందకు పైగా ఉన్నాయి. ఒక్కో గని విస్తీర్ణం ఎకరం నుంచి అయిదు ఎకరాల వరకు ఉంది. లీజు కాల పరిమితి పదేళ్లకు పైబడి ఉంటుంది. కూలీలు తవ్వకాలు జరిపితే గనుల్లోంచి ముడిసరకు నామమాత్రం గానే బయటికి వస్తుంది. ఇది తమకు గిట్టుబాటు కాదంటూ ఏకంగా జేసీబీలను వినియోగి న్నారు. ప్రతిరోజూ వందల కొద్ది టన్నులను వెలికి తీస్తున్నారు. పదేళ్లలో వెలికి తీయాల్సిన సుద్ధను కేవలం నెలల పరిధిలోనే పూర్తి చేస్తున్నారు. పగటివేళ గనుల్లోంచి జేసీబీలను వినియోగించి ముడిసుద్దను వెలికి తీస్తున్నారు. టిప్పర్లు, లారీల్లో నింపి సవిూప వ్యవసాయ పొలాల్లో భారీగా నిలువ చేస్తున్నారు. పరిశ్రమల నుంచి వచ్చిన ఆర్డర్లను అనుగుణంగా రాత్రివేళల్లో లారీల్లో నింపి తరలిస్తున్నారు. ప్రతిరోజు డిమాండ్‌ను బట్టి వందల కొద్ది లారీల్లో సుద్ద తరలిపోతోంది. సుద్ద ఖనిజం తరలింపుతో అక్రమ రవాణా విషయంలో విమర్శలు వెల్లు వెత్తడంతో అధికారులు స్పందించారు. అడపాదడపా దాడులుచేసి ఎలాంటి పత్రాలు లేకుండా సరకును తరలిస్తున్న లారీలను జప్తు చేసి జరిమానా విధించారు.



