సుప్రీంకు కె.ఎం.జోసెఫ్‌ 

– ఎట్టకేలకు తొలగిన ప్రతిష్ఠంభన
– సుప్రింకోర్టుకు జోసఫ్‌ పేరును ఆమోదించిన కేంద్రం
– తాజా నిర్ణయంతో 25కు చేరిన సుప్రిం న్యాయమూర్తుల సంఖ్య
– మరో ఆరు స్థానాలు ఖాళీ
న్యూఢిల్లీ, ఆగస్టు3(జ‌నం సాక్షి) : ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసఫ్‌ పదోన్నతిపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. జస్టిస్‌ జోసఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం ప్రతిపాదనకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జస్టిస్‌ జోసఫ్‌తో పాటు మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్‌ శరణ్‌లకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది.జస్టిస్‌ జోసఫ్‌ పదోన్నతి విషయమై గత కొంతకాలంగా సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జస్టిస్‌ జోసఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదిస్తూ ఈ ఏడాది జనవరిలో కొలీజియం ప్రభుత్వానికి సిఫార్సులు పంపింది. అయితే ఈ సిఫార్సులను కేంద్రం తిరస్కరించింది. జస్టిస్‌ జోసఫ్‌కు సీనియార్టీ లేదని, ఆయన పదోన్నతి అంశాన్ని మరోసారి పరిశీలించాలని కోరింది. ఆ తర్వాత మళ్లీ పరిశీలన జరిపిన కొలీజియం మే 16న మరోసారి జస్టిస్‌ జోసఫ్‌ పేరును ప్రతిపాదిస్తూ కేంద్రానికి సిఫార్సులు పంపింది. తాజాగా ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదించింది. జస్టిస్‌ జోసఫ్‌ పదోన్నతి అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. జస్టిస్‌ కేఎం జోసఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించకుండా తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. దానికి సంబంధించి కేసును జస్టిస్‌ జోసఫ్‌ విచారించారు. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన జస్టిస్‌ జోసఫ్‌.. తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అవకాశమిచ్చారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే కేంద్రం ఆయన పదోన్నతికి అడ్డుపడుతుందనేది ప్రతిపక్షాల వాదన. ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో జస్టిస్‌ జోసఫ్‌ త్వరలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా ఆమోదాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 25కు పెరిగింది. ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.