సుప్రీంకు చేరిన హిజాబ్ వివాదం
` లిస్టింగ్‌పై పరిశీలిస్తామని వెల్లడి
` సంయమనం పాటించండి
` కర్ణాటక హైకోర్టు కీలక సూచన
` ఫిబ్రవరి 14న మరోసారి విచారణ జరుపుతామన్న న్యాయస్థానం
దిల్లీ,ఫిబ్రవరి 10(జనంసాక్షి):హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలోనే.. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీం కోర్టులో కొత్తగా ఓ పిటిషన్ దాఖలయ్యింది. కర్ణాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై నడుస్తోన్న కేసులను సుప్రీం కోర్టు బదిలీ చేసుకొని విస్తృత ధర్మాసనంలో విచారణ జరపాలని పిటిషినర్ విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున అక్కడ వచ్చే నిర్ణయం అనంతరం ఈ పిటిషన్ లిస్టింగ్‌పై పరిశీలిస్తామని స్పష్టం చేసింది.ఇదిలాఉంటే, హిజాబ్ ధరించడం తమకు రాజ్యాంగం కల్పించిన హక్కు అంటూ పలువురు విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి వాదనలు విన్న అనంతరం కేసు విచారణను ఫిబ్రవరి 14న మరోసారి చేపడతామని పేర్కొంది. ఆలోపు కళాశాలలు తెరచుకునేలా ఆదేశాలు జారీ చేస్తామన్న హైకోర్టు ధర్మాసనం, ఈ వివాదం పరిష్కారమయ్యేంత వరకూ ప్రజలను రెచ్చగొట్టే ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించాలని విద్యా సంస్థల్లో పట్టుబట్టకూడదని సూచించింది. వీలైనంత త్వరగా ఈ వివాదం పరిష్కారం కావాలనే కోరుకుంటున్నామని.. అప్పటివరకు శాంతి, సామరస్య వాతావరణం నెలకొల్పాలని కర్ణాటక హైకోర్టు ఆకాంక్షించింది.అంతకుముందు హిజాబ్ వివాదంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టులోని ఏకసభ్య ధర్మాసనం.. దీనిపై మరింత విస్తృతంగా విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిరది. దీనిపై విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ కృష్ణ దీక్షిత్ సిఫార్సు చేశారు. ఇదే అంశంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ల అన్నింటిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ ప్రారంభించింది.