సుప్రీం తీర్పుపై ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అసంతృప్తి

రివ్యూ పిటిషన్‌ వేస్తామన్న ఛైర్మన్‌
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ):  కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు ఎ.పద్మకుమార్‌ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసవిూక్షను కోరుతూ పిటిషన్‌ వేస్తామన్నారు. మతపెద్దలతో చర్చించి వారి మద్దతు కూడగట్టిన తర్వాత పిటిషన్‌ వేస్తామని అన్నారు. అంతకుముందు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. ఆలయాల్లో ప్రవేశం విషయంలో లింగవివక్షకు తావు లేదని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. 10 నుంచి 50 ఏళ్ల మహిళలకు ఆలయ ప్రవేశంపై నిషేధం రాజ్యాంగ సిద్దాంతాల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. దేవతలను పూజించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఇక్కడ స్త్రీ, పురుషుల భేధం అనేది ఉండదని, వివక్షకు తావేలేదని పేర్కొంది.
ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో జీసేఐ దీపక్‌ మిశ్రాతో పాటు న్యాయమూర్తులు రోహిన్‌టన్‌ నారిమన్‌, ఏఎం ఖన్విల్కర్‌, డివై చంద్రచూడ్‌, ఇందు మల్హోత్రా ఉన్నారు. తీర్పులో వెలువరించిన అంశాలపై నలుగురు ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం విభేదించారు.
సుప్రీం తీర్పును స్వాగతించిన మేనకాగాంధీ
కేరళ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ, జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ రేఖా శర్మ తెలిపారు. కేసు విచారణపై తీర్పు వెల్లడి సందర్భంగా ఆడవాళ్లపై ఉన్న ఆలయ ప్రవేశ నిషేదాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 10 నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్న స్త్రీలు సైతం శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చని తెలిపింది. శారీరక, భౌతిక కారణాలను చూపిస్తూ వారిపై నిషేధాన్ని విధించడం సరికాదని పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతించిన మేనకాగాంధీ, రేఖాశర్మ స్పందిస్తూ.. సుప్రీం తీర్పు అద్భుతమైన నిర్ణయమన్నారు. ఈ నిర్ణయంతో అందరిని కలుపుకుంటూ హిందూమతం దారులు మరింత ముందుకు తెరుచుకోబడతాయన్నారు. ఇది ఏ ఒక్క కులానికో.. ఏ ఒక్క వర్గానికి చెందిన ఆస్తి కాదన్నారు. ఆలయానికి వెళ్లాలా? లేదా? అని ఇకపై మహిళలే నిర్ణయించు కోవచ్చన్నారు. మతం.. సమానత్వం రెండింట్లో సమానత్వమే ఎప్పుడూ గెలుపొందాలని పేర్కొన్నారు.