సురక్షితంగా చిన్నారి

– బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించిన సిబ్బంది
– 29గంటల ఆపరేషన్‌ తర్వాత బయటకు
పట్నా, ఆగస్టు2(జ‌నం సాక్షి) : బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారిని సహాయక సిబ్బంది 29 గంటల ఆపరేషన్‌ తర్వాత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బిహార్‌లోని ముంగర్‌ జిల్లాలో మూడేళ్ల సనా ఇంటి దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావి కోసం వేసిన గుంతో పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం పాప బోరుబావిలో పడిపోగా బుధవారం రాత్రి ఆమెను కాపాడారు. పాప సురక్షితంగా బయటకు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సహాయక సిబ్బంది సహా అక్కడి వారంతా చాలా సంతోషించారు. దాదాపు వంద అడుగుల లోతున్న బోరుబావిలో సనా 50అడుగుల వద్ద చిక్కుకుపోయిందని పోలీసులు వెల్లడించారు. పైనుంచి ఆక్సిజన్‌ పైపు, లైట్‌, సీసీటీవీ కెమెరాను గుంతలోకి దింపామని చెప్పారు. బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వి చిన్నారిని కాపాడినట్లు తెలిపారు. సహాయక సిబ్బంది పాప దగ్గరికి చేరుకునేసరికి ఆమె వద్ద పైనుంచి పంపించిన బిస్కెట్లు, మంచినీరు ఉన్నాయని చెప్పారు. పాప కాలు గొయ్యిలో ఇరుక్కోవడంతో బయటకు తీసుకొచ్చేందుకు కాస్త ఆలస్యమైందని చెప్పారు. పాప బోరుబావిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను పిలుస్తూనే ఉందని, వారి మాటలకు సమాధానం ఇస్తూ ఉందని పోలీసులు వెల్లడించారు. సహాయక చర్యల సమయంలో భారీ వర్షం కురుస్తుండడంతో చాలా ఇబ్బంది కలిగిందని చెప్పారు. ఘటనాస్థలం వద్ద వైద్యుల బృందం ఉందని బయటకు తీసుకురాగానే అత్యవసర వైద్య సహాయం అందించారని తెలిపారు. తర్వాత పట్నా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సహాయక చర్యలను బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్వయంగా పరిశీలించారు.