సుష్మాలాంటి వ్యక్తి చైనాముందు తలొంచారు!

– సుష్మాపై రాహుల్‌ గాంధీ ట్వీటాస్త్రం

న్యూఢిల్లీ, ఆగస్టు2(జ‌నం సాక్షి) : డోక్లాం ప్రతిష్టంభన పరిష్కారమైనట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ చేసిన ప్రకటనపై రాహుల్‌ గాంధీ ఘాటుగా స్పందించారు. ఆమె చైనా శక్తికి జోహార్‌ అయిపోయారని గురువారం ఓ ట్వీట్‌లో ఆరోపించారు. సుష్మా స్వరాజ్‌ బుధవారం పార్లమెంటులో మాట్లాడుతూ డోకలాం సమస్య దౌత్యపరమైన పరిణతితో, ఎటువంటి నష్టం జరగకుండా పరిష్కారమైందని చెప్పారు. (భూమిపై) యథాతథ స్థితిలో ఎటువంటి మార్పు లేదని చెప్పారు. 2017 ఆగస్టు 28న డోకలాం వద్ద ఘర్షణ ముగిసిందని తెలిపారు. ఇదిలావుండగా ఇటీవల ఓ అమెరికా ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఓ వార్తా కథనం వెలువడింది. డోకలాం ప్రాంతంలో చైనా నెమ్మదిగా కార్యకలాపాలను పునరుద్ధరించిందని ఆ ఉన్నతాధికారి చెప్పినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో ‘చైనా అధికారం ముందు సుష్మా స్వరాజ్‌ వంటి మహిళ లొంగిపోవడం, సాగిలపడటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. నాయకుడికి సంపూర్ణంగా పరాధీనం కావడమంటే సరిహద్దుల్లో మన ధైర్యసాహసాలుగల జవాన్‌కు నమ్మకద్రోహం చేయడమే అంటూ పేర్కొన్నారు. ఆయన ఈ ట్వీట్‌తోపాటు అమెరికా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలుగల వార్తా కథనాన్ని కూడా రాహుల్‌ తన పోస్ట్‌ లో జతచేశారు.