సెన్సార్ పూర్తయిన చిత్రాలపై కమిటీల ఏర్పాటు తగదు
‘దేనికైనా రెడీ’ చిత్ర వివాదంలో హైకోర్టు తీర్పు
జొన్నవిత్తులకు బెదిరింపు కాల్స్‌శ్రీ బ్రాహ్మణుల దీక్ష భగ్నం
హైదరాబాద్, నవంబర్ 9 (జనంసాక్షి):
దేనికైనా రెడీ చిత్ర వివాదంలో నిర్మాతకు హైకోర్టులో శుక్రవారం నాడు ఊరట లభించింది. ఈ చిత్రంలో తమవర్గాన్ని కించపరుస్తూ అభ్యం తరకర సన్నివేశాలు, మాటలు ఉన్నాయని, చిత్రాన్ని నిలిపివేయాలంటూ బ్రాహ్మణుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చెల్లదంటూ హైకోర్టు నేడు తీర్పు చెప్పింది. ఒకసారి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చిత్రం విడుదలైన తరువాత ఆ ప్రక్రియలో ఎవరూ జోక్యం చేసుకోవడం తగదని చిత్ర నిర్మాత మోహన్‌బాబు హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ పూర్తయిన తర్వాత చిత్రం వ్యవహారంలో ప్రభుత్వ సంస్థ్థలు కానీ, మరే సంస్థలు కానీ జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు తీర్పులను ఆయన ప్రస్థావించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల నియామకాలను తప్పుపట్టింది. సెన్సార్ బోర్డు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని ఒకసారి చిత్రం సెన్సార్ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వాటిలో జోక్యం చేసుకోరాదని కోర్టు పేర్కొంది. దీంతో ఏ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం, దేనికైనా రెడీ చిత్రాల పరిశీలనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు వేరు వేరు కమిటీల నియామకం చెల్లదని తేలిపోయింది.
కాగా, ఈ చిత్రంలోని సన్నివేశాలు, మాటలపై జోక్యం చేసుకుంటూ తప్పుపట్టిన సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు శుక్రవారంనాడు రెండుసార్లు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడారని ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకున్నావని బెదిరించారన్నారు. తనను అసభ్యకర భాషతో దూషించడమే కాక చంపుతామని బెదిరించారని చెప్పారు. ఇదిలా ఉండగా, దేనికైనా రెడీ చిత్రాన్ని రద్దు చేయాలని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని కొత్తపేట చౌరస్థా వద్ద గత మూడు రోజులుగా బ్రాహ్మణ సంఘాలు అమరణ నిరాహారదీక్షకు దిగాయి. శుక్రవారంనాడు ఇద్దరి బ్రాహ్మణుల ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అస్వస్తతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులను ఆందోళన కారులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. కొందరు బ్రాహ్మణులు పోలీసులను అడ్డుకుంటూ రోడ్డుపై బైఠాయించడంతో వారిని పక్కకు తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎట్టకేలకు బ్రాహ్మణ దీక్షను పోలీసులు భగ్నం చేయగలిగారు.