సెప్టెంబర్‌  నుంచి రేషన్‌ షాపుల్లో .. 


రాగులు, జొన్నలు పంపిణీ
– రేషన్‌ డీలర్ల పనితీరు మెరుగుపర్చేలా చర్యలు
– అన్నా క్యాంటీన్లతో నిరుపేదలకు మేలు
– క్యాంటీన్లు పెంచాలనే డిమాండ్‌ పెరుగుతుంది
– రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు
విశాఖపట్టణం, జులై27(జ‌నంసాక్షి) : సెప్లెంబర్‌ నుంచి రేషన్‌ షాపుల్లో రాగులు, జొన్నలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ ద్వారా రేషన్‌ షాపులపై ప్రజల సంతృప్తి శాతాన్ని సర్వే చేశామని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో రేషన్‌ డీలర్ల పనితీరును మెరుగుపరిచేందుకు జోన్‌ ల వారీగా సమావేశం నిర్వహిస్తున్నామని.. శుక్రవారం విశాఖలో మూడో సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో నాలుగు జిల్లాల అధికారులు పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. ఇటువంటి సమావేశాలు ప్రతీ మూడు నెలల కొకసారి నిర్వహిస్తామన్నారు. ఆహార నియమాలను మార్చడానికి ఒక ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. రైస్‌ కంటే రాగులు, సజ్జలు ఆరోగ్యానికి మంచిదని సూచించారు. దీనిలో భాగంగా సెప్టెంబర్‌ నెల నుండి పౌర సరఫరాల శాఖ ద్వారా అన్ని జిల్లాలకు రాగులు, జొన్నలు,
సజ్జలు పంపిణీ చేస్తామన్నారు. అన్నా క్యాంటిన్లు విజయవంతంగా నడుస్తున్నాయని, నిరు పేదలకు బాగా ఉపయోగపడుతున్నాయన్నారు మంత్రి  తెలిపారు. క్యాంటిన్లు పెంచమనే డిమాండ్‌ పెరుగుతుందని,  1100 ద్వారా అన్నా క్యాంటిన్‌ పై ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇక లారీల సమ్మె ప్రభావం ఇంతవరకు పౌర సరఫరాల శాఖపై లేదన్నారు మంత్రి… ఒక వేళ ప్రభావం పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. సమ్మె ఉధృతం అయితే దాని ప్రభావం సామాన్యుడిపై పడుతుందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి లారీల సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు కోరారు.

తాజావార్తలు