సెమీస్ పోరుకు సై అంటున్న భారత్, వెస్టిండీస్

i23ojt9n

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న భారత్, వెస్టిండీస్ సెమీఫైనల్ మ్యాచ్ పైనే అందరి దృష్టి. కప్ కు రెండే రెండు అడుగులున్న నేపథ్యంలో ఇరు జట్లు వాంఖడేలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే అందరి ఫోకస్ మాత్రం ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ, విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ పైనే. సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్.. దూకుడును కొనసాగించాలన్న కృతనిశ్చయంతో ఉండగా, విధ్వంసకర ఆటతీరుతో మరోసారి లైమ్ లైట్ లో నిలవాలని క్రిస్ గేల్ తపిస్తున్నాడు.

టీ20 వరల్డ్ కప్ లో క్రిస్ గేల్ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్పై విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీ చేసి అలరించిన సునామీ గేల్.. ఆ తర్వాత మ్యాచ్ లో కేవలం నాలుగు రన్సే చేశాడు. ఇక కోహ్లి స్థిరంగా రాణిస్తూ టోర్నీలోనే బెస్ట్ బ్యాటింగ్ స్టార్ గా నిలిచాడు. పాకిస్థాన్ పై అర్ధసెంచరీ, ఆస్ట్రేలియాపై చేసిన 82 పరుగులతో భారత్కు అద్భుతమైన విజయాలన్నందించి సెమీస్ కు చేర్చాడు. ఇప్పటికే 184 పరుగులు చేసిన కోహ్లి టోర్నమెంటులో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.

వాంఖడే స్టేడియంలో ఫ్లాట్ వికెట్ ఉండటంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ఇరు జట్లలోనే హార్డ్ హిట్లర్లు ఉండడంతో రన్ ఫీస్ట్ ఖాయం. అయితే గేల్, కోహ్లీలలో ఎవరి బ్యాట్ నుంచి మోతమోగనుందోనన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దూకుడు మీద ఉన్న క్రిస్ గేల్ భారత బౌలర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రతి బంతిని బాదడమే లక్ష్యంగా బ్యాటింగ్ కు దిగుతానని, తన జట్టును గెలిపించడమే లక్ష్యమని చెప్పాడు.

2007 ఫలితాన్ని రిపీట్ చేయడంపై దృష్టి పెట్టిన ధోనీసేన మరోసారి ఈ మెగా టైటిల్ ను సొంతగడ్డపై అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. టాపార్డర్ గాడిన పడితే టీమిండియాకు అందోళన మాయమనట్టే. రోహిత్, ధావన్ పరుగుల ట్రాక్ లో పడితే విండీస్కు కష్టాలు తప్పవు. గాయం కారణంగా యువీ తప్పుకోవడంతో అతని స్థానంలో మనీష్ పాండే జట్టులోకి వచ్చాడు. మనీష్, రహానే రూపంలో రెండు ఆప్షన్స్ భారత్ కు ఉన్నా, తుది జట్టులో మనీష్ పాండే కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.

మరోవైపు ఆఫ్గనిస్థాన్ చేతిలో ఊహించని రీతిలో పరాజయం పొందిన కరేబియన్ టీమ్.. అప్రమ్తతతోనే సెమీస్ పోరుకు సిద్ధమైంది. గేల్ తో పాటు శామ్యూల్స్, బ్రావో, రాందిన్లపై బ్యాటింగ్ భారం ఉంది. విండీస్ కు గాయాలూ వేధిస్తున్నాయి. శ్రీలంకపై సూపర్ ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చిన ఫ్లెచర్ టోర్నమెంటుకు దూరం కావడం వెస్టిండీస్ కు ఎదురుదెబ్బగా మారింది. అతని స్థానంలో లెండ్లె సిమన్స్ జట్టులోకి రానున్నాడు.

మొత్తానికి క్లాష్ ఆఫ్ టైటాన్స్ పోరు ఉత్కంఠ రేపుతోంది. వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా.. గేల్ పై మొత్తం భారమేసి బరిలోకి దిగుతున్న వెస్టిండీస్ లలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.