సెమీస్ లో టీమిండియా ఎదురైతే.. ఈసారి కచ్చితమైన జవాబిస్తాం

కరాచీ:వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాతో మరోసారి తలపడే అవకాశం లభిస్తే వారికి దీటుగా బదులిస్తామని పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ స్పష్టం చేశాడు.క్వార్టర్ ఫైనల్ పోరులో ఇరుజట్లు విజయం సాధిస్తే మాత్రం ఆ జట్ల మధ్య సెమీ ఫైనల్ పోరు జరుగనుంది. ఒకవేళ టీమిండియా-పాకిస్థాన్ లు సెమీ ఫైనల్లో తలపడితే మాత్రం ఈసారి కచ్చితమైన జవాబిస్తామన్నాడు. లీగ్ పోరులో ఎదురైన ఓటమిని దృష్టిలో పెట్టుకోమని మిస్బాబుల్ తెలిపాడు. ఇదిలా ఉంగా టీమిండియా వరుస విజయాలపై మిస్బా తనదైన శైలిలో స్పందించాడు.
‘ గత కొంతకాలంగా టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటమే ఆ జట్టుకు లాభించింది. ఈ టోర్నమెంట్ లో టీమిండియా అంచనాలను మించి రాణిస్తోంది.ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విజయవంతమైన కెప్టెన్’ అని తెలిపాడు. కాగా, తమ ప్రజలు మరోసారి వరల్డ్ కప్ ను తీసుకురావాలని ఆశిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తమ జట్టుపై చాలా అంచనాలు ఉన్నాయని వాటిని నిజం చేసుకునేందుకు పోరాడతామని మిస్బా అన్నాడు.
మార్చి 19వ తేదీన టీమిండియా -బంగ్లాదేశ్ ల మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ పోరు జరుగుతుండగా, మార్చి 20వ తేదీన ఆస్ట్రేలియా-పాకిస్థాన్ ల మధ్య మూడో క్వార్టర్స్ జరుగనుంది.



