సెల్‌టవర్ నిర్మాణంపై ఉద్రిక్తత
ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే నిరసన
విజయనగరం,సెప్టెంబర్29(జనంసాక్షి): పార్వతీపురం పట్టణం 2వ వార్డు కొత్తవీధిలో ఉద్రిక్తత ఏర్పడింది.
సెల్ టవర్ నిర్మాణాన్ని అధికార, ప్రతిపక్ష, వామపక్షాల నేతలు, స్థానిక మహిళలు అడ్డగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. అధికారపార్టీ కౌన్సిలర్ సహా ఇతర నేతలు, స్థానికులను బలవంతంగా వాహనాల్లో సంఘటన స్థలం నుంచి పోలీసులు తరలించారు. పోలీసుల చర్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఆగని టవర్ నిర్మాణ పనులు నిలిపివేయలేదు. పోలీసుల సమక్షంలో కార్మికులు పనులు చేస్తున్నారు. దీంతో
రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ టవర్ వివాదంలో పోలీసులు అతిగా స్పందిస్తూన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు, అధికారపార్టీ కౌన్సిలర్‌ల అరెస్టులకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి అరెస్టుచేసినవారిని తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళతామని హెచ్చరించారు. సుమారు గంటపాటు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.