సైన్యంపై కేసులపై సవాల్‌

విచారణకు స్వీకరించిన సుప్రీం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ దాదాపు 300 మంది సైనికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్మీ బలగాల ప్రత్యేక హక్కుల చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో తాము పాల్గొన్న ఆపరేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సవాలు చేస్తూ 300 మంది సైనికులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. కోర్టు వారి పిటిషన్లపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఏఎం ఖాన్‌ విల్కర్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20వ తేదీన వాటిపై విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఆర్మీ బలగాల ప్రత్యేక హక్కుల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) అమల్లో ఉన్న ప్రాంతాల్లో తమ విధులను నిర్వర్తించినందుకు సైనికులు విచారణ ఎదుర్కుంటున్నారని ఆరోపిస్తూ న్యాయవాది ఐశ్వర్య భాటి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు అంగీకరించింది. ఏఎఫ్‌ఎస్‌పీఏ ప్రకారం జవాన్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, వారిని విచారించడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి విచారణల వల్ల సైనిక బలగాలు, పారా మిలిటరీ బలగాల ధైర్యం తగ్గుతుందని తెలిపారు. మణిపూర్‌లో, తదితర ప్రాంతాల్లో నకిలీ ఎన్‌కౌంటర్ల కేసుల్లో జవాన్లు విచారణ ఎదుర్కొంటున్నారు. కొన్ని ఘటనల్లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే విచారణలు ప్రారంభయ్యాయి. ముఖ్యంగా మణిపూర్‌లో జరిగిన పలు నకిలీ ఎన్‌కౌంటర్‌ ఘటనలపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.

——————-