సోనియాగాంధీ లెక్కల్లో వీక్‌

– ఆమె లెక్కలు మరోసారి తప్పవుతాయి
– కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌
న్యూఢిల్లీ, జులై19(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లెక్కల్లో వీక్‌ అని కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానంలో ఎన్డీయే ప్రభుత్వం తప్పకుండా నెగ్గుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం గురించి సోనియా చేసిన వ్యాఖ్యలపై స్పందనేమిటో
తెలియజేయాల్సిందిగా విూడియా ప్రతినిధులు కేంద్రమంత్రిని అడిగారు దీంతో స్పందించిన మంత్రి ‘సోనియాజీ లెక్కల్లో వీక్‌.. 1996లో కూడా వాళ్లు ఇదే విధంగా లెక్కించారు. కానీ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే అన్నారు. వారి లెక్కలు మరోసారి తప్పుతాయని మంత్రి స్పష్టం చేశారు. పార్లమెంటు లోపలా, బయటా మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని, అన్ని వైపుల నుంచి మోదీకి మద్దతు ఎలా వస్తుందో విూరందరూ చూస్తారని ఆయన పేర్కొన్నారు. 1999లో సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘272 మంది మద్దతు ఉందని, ఇంకా మద్దతు తెలిపే వాళ్లు ఉన్నారని ఆమె చెప్పారు.. కానీ అప్పుడు ఏం జరిగింది. వాజ్‌పేయీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో భాజపా ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్‌ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంలో తాము తప్పకుండా నెగ్గుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శివసేన కూడా తమకే మద్దతు ఇస్తుందని అన్నారు. ఇక భాజపాలోనే ఉంటూ సొంత పార్టీపై విమర్శలు చేసే ఎంపీ శతృఘ్నసిన్హా కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగానే ఓటు వేయనున్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని కాంగ్రెస్‌ విశ్వాసం వ్యక్తం చేసింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి సరైన సంఖ్యా బలం లేదు కదా అని విలేకర్లు నిన్న సోనియాను ప్రశ్నించగా.. ‘మాకు సంఖ్యా బలం లేదని ఎవరు చెప్పారు?’ అని ప్రశ్నించారు.
1996లో భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో వాజ్‌పేయీని ప్రధానిగా ఎన్నుకున్నారు. కానీ లోక్‌సభలో విశ్వాసం పొందలేక ఆ ప్రభుత్వం 13రోజుల్లోనే కూలిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన దేవెగౌడ, గుజ్రాల్‌ ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో పడిపోయాయి.
——————————–