సోనియాజీ .. తెలంగాణ ఇచ్చేయండి

నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నాం
తెలంగాణ ప్రకటిస్తే అన్ని స్థానాలూ గెలుస్తాం
షిండేతో కలిసి టీఎంపీలు మేడంతో భేటీ
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీలు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని కోరారు. గురువారం హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో కలిసి టెన్‌ జన్‌పథ్‌కు వచ్చిన ఎంపీలు మేడంతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు వివరించి సమస్య వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇటీవల పార్లమెంట్‌లో అధినేత్రిని కలిసిన ఎంపీలు తెలంగాణపై చర్చించే అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ సమయంలో బెట్టు చేసిన టీ కాంగ్రెస్‌ ఎంపీలకు అఖిలపక్షంపై హామీ ఇచ్చారు. ఈమేరకు హోం మంత్రి షిండేతో ఎంపీలు తరలివెళ్లి సోనియాను కలిశారు. తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు వివరించారు. వీరి భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల
ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ కూడా పాల్గొన్నారు.
దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో.. తెలంగాణ అంశం, అఖిలపక్ష సమావేశంపై చర్చించారు. తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులు, నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం వల్ల పార్టీ నష్టపోతున్న తీరు, తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అధినేత్రికి క్షుణ్ణంగా వివరించారు. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని, లేకుంటే పార్టీ మనుగడ కష్టమని తేల్చిచెప్పారు. తెలంగాణ ఇవ్వకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, టీఆర్‌ఎస్‌తో పాటు వైఎస్సార్‌సీపీ కూడా బలోపేతమవుతుందని సోనియాకు తెలిపారు. రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపితే టీఆర్‌ఎస్‌ ఎలాగూ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని.. తద్వారా తెలంగాణలోని అన్ని సీట్లను గెలుచుకోవచ్చని చెప్పారు. అటు వలసలు ఆగిపోయి వైఎస్సార్‌సీపీ బలోపేతం కాకుండా నిరోధించవచ్చని సూచించారు. టీ-ఎంపీలు చెప్పిందంతా విన్న సోనియా నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.
త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాం..
తెలంగాణపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసినందుకు సోనియాకు ధన్యవాదాలు తెలిపామని టీ-ఎంపీలు తెలిపారు. అధినేత్రితో భేటీ అనంతరం వారు విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే, ఇవ్వకపోతే జరిగే లాభనష్టాలపై సోనియాకు వివరించామని తెలిపారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. సోనియా తాము చెప్పిన అన్ని విషయాలను సానుకూలంగా విన్నారని, సానకూలంగా స్పందించారని తెలిపారు. ఏయే అంశాలపై చర్చ జరిగిందని ప్రశ్నించగా.. పార్టీ అధినేత్రితో జరిగిన అంతర్గత సమావేశ వివరాలను బయటకు చెప్పజాలమన్నారు. అయితే, ఈ నెల 28 తర్వాత తెలంగాణపై స్పష్టత వస్తుందని చెప్పారు.
పార్టీల అసలు రంగు బయటపడుతుంది
తెలంగాణపై నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంతో టీడీపీ, వైఎస్సార్‌ సీపీల అసలు రంగు వెల్లవడువుతుందని మధుయాష్కీ అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఈ ప్రాంతంలో పాదయాత్రల పేరుతో దండయాత్రులు చేస్తున్న వారు.. అదే వైఖరికి కట్టుబడి అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తుందని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మిగతా పార్టీల అభిప్రాయాలు తెలుసుకొని.. అందుకనుగుణంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందన్నారు. 2009 డిసెంబర్‌ 9వ తేదీనే కాంగ్రెస్‌ పార్టీ తన నిర్ణయం చెప్పిందని, ఈసారి కూడా అలాగే ఇతర పార్టీల అభిప్రాయం తీసుకొని నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. అఖిలపక్షం ఓ డ్రామా అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను విలేకరులు ప్రశ్నించగా… రాజకీయాలంటేనే డ్రామాలన్నారు. ఎవరు ఏమనుకున్నా.. 28 నాటి సమావేశం తర్వాత తెలంగాణపై స్పష్టత వస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే వలసలు ఆగిపోతాయని, కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకోవచ్చని మందా జగన్నాథం అన్నారు. 900 మంది శ్ర్య్ష్థీులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారని, ఆత్మహత్యలను ఆపాలంటే రాష్ట్రం ఏర్పాటు చేయాలని అధినేత్రికి వివరించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సోనియాను కోరినట్లు రాజయ్య తెలిపారు. దొంగ పార్టీలకు అవకాశం లేకుండా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.