సోనియాపై మళ్లీ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

2

మండిపడ్డ కాంగ్రెస్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌1(జనంసాక్షి):  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీపై మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. తెల్లతోలు వల్లే సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షురాలు అయిందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ నైజిరీయా దేశస్తురాలిని వివాహం చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యాలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యాలు బీజేపీ మైండ్‌సెట్‌కు  అద్దం పడుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. సోనియాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని గిరిరాజ్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. హద్దు విూరి సిగ్గుమాలిన వ్యాఖ్యలకు పాల్పడ్డాడంటూ కాంగ్రెస్‌ నేత ప్రియాంక చతుర్వేది ట్వీట్‌ చేశారు. అయితే గిరిరాజ్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఇంతవరకు స్పందించలేదు. సదరు మంత్రి గత కొంత కాలంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని, ప్రధాని దీనిపై స్పందించాలంటూ సీపీఐ నేత బృందా కారత్‌ కోరారు. ఈ అంశంపై మోడీ మౌనం అటువంటి వ్యాఖ్యలను ప్రోత్సహించినట్లుగానే బావించాల్సొస్తుందని ఆమె అన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన కిరణ్‌ బేడీ ఈ వ్యాఖ్యల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరు ఏ వ్యాఖ్యలు చేసేది ప్రధాని ఎలా ఊహిస్తారన్నారు. కానీ, పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిరాజ్‌ సింగ్‌ బీహార్‌లో బలమైన రాజకీయ నేపథ్యమున్న భూమిహార్‌ సామాజిక వర్గానికి చెందినవారు. మోడీకి బలమైన మద్ధతుదారు. ప్రధాని అభ్యర్థిగా మోడీని బలపర్చిన వారిలో ప్రథముడు. మోడీ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించే వారిని పాకిస్తాన్‌కు పంపాలంటూ గత ఏడాది ఎన్నికల ప్రచారంలో గిరిరాజ్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.