సోషల్‌ విూడియాలో విపరీతం

ముల్ల పెరియార్‌ కూలిందంటూ ప్రచారం

అప్రమత్తం అయిన పోలీసులు

తిరువనంతపురం,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అల్లాడుతున్నది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాధితులకు సాయం చేయాల్సింది పోయి భయభ్రాంతులకు గురయ్యేలా కొంతమంది సోషల్‌ విూడియాలో పోస్ట్‌లు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా భారీ వర్షాలకు ముల్ల పెరియార్‌ డ్యామ్‌ కుప్పకూలిందని వదంతులు వ్యాప్తిచేశారు. దీంతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వర్షాలు, వరదలకు సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దాంతో పాటు డ్యామ్‌ కుప్పకూలిందని సోషల్‌ విూడియాలో ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్న నెటిజన్లపై కఠిన చర్యలుతీసుకోనున్నారు. యూట్యూబ్‌ వీడియోలు, ఫేస్‌బుక్‌ పోస్ట్‌లను పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కేరళ సైబర్‌ విభాగం నిర్ణయించింది. సోషల్‌విూడియాలో పుకార్లను అడ్డుకునేందుకు తగు చర్యలు చేపట్టింది. మరోవైపు త్రివిధ దళాలు, జాతీయ విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌), కోస్ట్‌గార్డ్‌ బృందాలు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి.