స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చొరవ తీసుకోండి

– ఉపరాష్ట్రపతి వెంకయ్యకు విన్నవించిన తెదేపా ఎంపీలు, ఐకాస సభ్యులు
న్యూఢిల్లీ, ఆగస్టు2(జ‌నం సాక్షి) : కడప జిల్లాలో ఉక్కుకర్మాగారం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరుతూ తెదేపా ఎంపీలు, కడప ఐకాస నేతలు గురువారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి విజ్ఞప్తి చేశారు.  ఢిల్లీలోని ఆయన నివాసంలో వెంకయ్యను కలిసిన నేతలు.. విభజన చట్టంలోని హావిూలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని వివరించారు. కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం సీఎం రమేశ్‌ విూడియాతో మాట్లాడుతూ… ‘కడప జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, ఐకాస నేతలందరం కలిసి ఉపరాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. ఆయనకు అన్ని విషయాలు తెలిసినందున ఈ అంశంలో చొరవ తీసుకుని పరిష్కరించేలా చేయాలని కోరామని తెలిపారు. ఉక్కు కర్మాగారంపై జిల్లాలో ఆందోళనలు జరుగుతున్నాయని, నేను కూడా దీక్ష చేశానని, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి రెండు ఆప్షన్లు ఇచ్చారన్నారు. దీనిపై కేంద్రం ఏదోఒకటి నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్లమెంటు ఉభయసభల్లో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వివరణ సరిగా లేదని రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయని, రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయని, ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఈ జిల్లా అనువైనదన్న విషయాన్ని ఉపరాష్ట్రపతికి వివరించామన్నారు. దీనికి ఆయన స్పందిస్తూ తన పరిధిలో ఉన్నంతవరకు మంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం మేం చేయగలిగినదంతా చేస్తామని, ఉపరాష్ట్రపతిని కలిసేందుకు తమతో రావాలని వైకాపా నేతలను కోరగా వారు స్పందించలేదన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ రావడం జగన్‌కు ఇష్టం లేదని, కడప జిల్లా ప్రజలు బాగుపడటం ఆయనకిష్టం లేదని సీఎం రమేష్‌ ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ వస్తే ఆ క్రెడిట్‌ అంతా తెలుగుదేశానికే వెళ్లిపోతుందడని జగన్‌ ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని రమేష్‌ పేర్కొన్నారు.