స్ట్రీట్ ఫైటింగ్ బెట్టింగే.. ఇద్దరు మైనర్లు..

హైదరాబాద్, మే 10: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో నబీల్ అనే కుర్రాడిని బలిగొన్న స్ట్రీట్ ఫైటింగ్ ఉదంతంపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనలోని నిందితులలో ఇద్దరు మైనర్లు కాగా, ఐదుగురు మేజర్లని, దృశ్యాల ఆధారంగా ఏడుగురిని మందిని అదుపులోకి తీసుకున్నామని సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీలో కొద్ది రోజులుగా స్ట్రీట్‌ ఫైటింగ్‌ జరుగుతున్నట్టు గుర్తించామన్న ఆయన, ఇప్పటికే దీనిపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. స్ట్రీట్‌ ఫైటింగ్‌ను బెట్టింగ్‌గా గుర్తించామని చెప్పారు. నబీల్‌ మృతదేహానికి సోమవారం పోస్ట్‌మార్టమ్‌ నిర్వహిస్తామన్న ఆయన, కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మీర్ చౌక్ పిఎస్ పరిధిలో ధనవంతుల పిల్లలు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ తరహాలో వీధుల్లో ఫైటింగ్‌ చేస్తూ హంగామా సృష్టిస్తున్నారని గత కొంతకాలంగా స్థానికులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. తాజా ఘటనలో సబీల్‌ను హత్య చేశారని అతని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా, అతని స్నేహితులు మాత్రం ప్రమాదవశాత్తు సంభవించిన మృతిగా ఈ ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.