స్తంభించిన పాలన
ఆదిలాబాద్, డిసెంబర్ 2 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని అధికారం కోసం ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కుమ్ములాడుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబు ఆరోపించారు. ప్రజల సమస్యను తెలుసుకుని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా సీపీఎం చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులను సతమతం చేస్తున్నారని విమర్శించారు. దీనికి తోడు విద్యుత్ చార్జీల పెంపు, గ్యాస్ రాయితీ ఎత్తివేత, రైతు పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతూ పాదయాత్రలు చేపుడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజల సమస్యల కోసం ఈ నెల 10, 11వ తేదీల్లో చేపట్టే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దత్తాత్రి, నాయకులు రాఘవులు, రాములు, తదితరులు పాల్గొన్నారు.